
ఆ మోదీ వెనుక ఈ మోదీ
వివిధ కేసుల్లో నిందితుడిగా ఉండి పరారీలో ఉన్న ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్‌మోదీకి బ్రిటన్‌లో ప్రయాణ పత్రాలు లభించేలా విదే శాంగ మంత్రి సుష్మాస్వరాజ్
► లలిత్‌మోదీని నరేంద్రమోదీ రక్షిస్తున్నారు: రాహుల్
► సుష్మాను తొలగించాలని డిమాండ్
► నిందితుడికి సుష్మా ‘సాయం’పై రాజకీయ దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ కేసుల్లో నిందితుడిగా ఉండి పరారీలో ఉన్న ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్‌మోదీకి బ్రిటన్‌లో ప్రయాణ పత్రాలు లభించేలా విదే శాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సాయం చేసిన ఉదంతం రాజకీయ దుమారంగా మారింది. ఇందులో ప్రధాని నరేంద్రమోదీ పాత్రపై విపక్ష కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సోమవారం తీవ్ర ఆరోపణలు గుప్పించారు. లలిత్‌కు సుష్మా సాయంలో ‘క్విడ్ ప్రో కో’ ఉందా? ప్రధాని పాత్ర ఏమిటి? అని కాంగ్రెస్ ప్రశ్నల వర్షం కురిపించింది. కాగా, సుష్మ ఏ తప్పూ చేయలేదని సర్కారు సమర్థించుకుంది.
‘ప్రధాని తాను పరిరక్షకుడినని, నల్లధనాన్ని వెనక్కు తెచ్చేది తనేనని చెప్తుంటారు. విదేశాల్లో నల్లధనానికి ప్రతీక లలిత్ మోదీ. ఇప్పుడు.. ప్రధాని మోదీ విదేశాంగ మంత్రి సుష్మ ద్వారా లలిత్‌ను రక్షిస్తున్నారు. ఏమిటిది?’ అని ఛత్తీస్‌గఢ్ పర్యటనలో ఉన్న రాహుల్ మండిపడ్డారు. సుష్మను బీజేపీ సమర్థించడాన్ని ప్రస్తావించగా.. ‘‘అవును.. ఆ పార్టీ సుష్మకు అండగా ఉంటుంది. పార్టీ అంటే నరేంద్ర మోదీ. ఈ మోదీ ఆ మోదీ(లలిత్‌మోదీ)కి అండగా నిలుచున్నారు. సుష్మ ఎవరు? చిన్న మంత్రి. ఆమె అంటే ప్రభుత్వానికి లెక్క లేదు. ఈ ప్రభుత్వాన్ని నడుపుతోంది ఒక్క నరేంద్ర మోదీనే. లలిత్‌ను కాపాడటాన్ని నరేంద్రమోదీ ఆపాలి. సుష్మను పదవి నుంచి తప్పించాలి’ అని డిమాండ్ చేశారు.
అంతా ప్రధాని కనుసన్నల్లోనే...
అంతకుముందు.. హవాలా, బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్, మనీ లాండరింగ్ తదితర అక్రమాల్లో రూ. 700 కోట్ల మేర స్కాంలో నిందితుడిగా ఉండి పరారీలో ఉన్న లలిత్‌కు.. ప్రధాని మోదీ రహస్య సమ్మతితో కేంద్రం, బీజేపీలు సాయం చేస్తున్నాయని, నేరాన్ని ప్రోత్సహిస్తున్నాయని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా మీడియా సమావేశంలో ఆరోపణలు గుప్పించారు. ‘ఇదంతా ప్రధాని మోదీ కనుసన్నల్లోనే జరిగింది. లలిత్‌కు ప్రయాణ పత్రాలు ఇవ్వరాదని, అతడిని భారత చట్టం ముందు నిలిపేందుకు వీలుగా అరెస్ట్ చేయాలని గత యూపీఏ ప్రభుత్వం బ్రిటన్‌ను కోరింది. బ్రిటన్‌తో మన దేశం చేసిన సంప్రదింపులను సుష్మ కాలరాశారు’ అని ధ్వజమెత్తారు. ‘‘లలిత్‌కు సుష్మతో పరిచయముంది. ఆమె కుటుంబసభ్యులు అతడికి న్యాయవాదిగా వ్యవహరించారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షాలతోనూ అతడికి దీర్ఘకాలిక సంబంధాలున్నాయి’ అంటూ.. మోదీ, అమిత్‌షాలతో లలిత్ కలసివున్న ఫొటోలను చూపారు. ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలంటూ ప్రధానికి ప్రశ్నలు వేశారు.
ప్రధాని మోదీకి కాంగ్రెస్ ప్రశ్నలివీ...
మనీ లాండరింగ్ తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్‌కు సాయం చేయటంలో ఏదైనా ‘క్విడ్ ప్రో కో’ ఉందా?
నరేంద్రమోదీ, అమిత్‌షా, లలిత్‌ల మధ్య సంబంధం ఏమిటి? ప్రధాని సూచనల మేరకు సుష్మాస్వరాజ్ నడుచుకున్నారా?
గత యూపీఏ ప్రభుత్వం తెలిపిన అభ్యంతరాలను కాలరాసి లలిత్‌కు ఎందుకు సాయం చేశారు? ఈ విషయం ప్రధానమంత్రి, ఆర్థికమంత్రికి ముందే తెలుసా?
భారత్‌లో నేరాలు చేసి తప్పించుకున్న వ్యక్తికి ట్రావెల్ డాక్యుమెంట్లు సమకూర్చాలని విదేశాంగ మంత్రి ఎలా అడుగుతారు?
మానవీయ కోణంలోనే అతడికి పోర్చుగల్ వెళ్లేందుకు డాక్యుమెంట్లు సమకూర్చితే.. మరి అక్కడి నుంచి భారత్‌కు పంపే ఏర్పాట్లు ఎందుకు చేయలేదు?
బ్లూకార్నర్ నోటీసున్న లలిత్ లాంటి వ్యక్తి తప్పించుకునేందుకు సాయపడ్డ సుష్మపై నేరాభియోగం ఎందుకు మోపకూడదు?
‘నిందితులకు మంచి రోజులొచ్చాయి’
క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న అమిత్‌షా, రామ్‌దేవ్, లలిత్ వంటి వారికి ‘అచ్ఛే దిన్’ (మంచి రోజులు) వచ్చాయని కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ ట్విటర్‌లో ఎద్దేవా చేశారు. సుష్మ రాజీనామా చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సోమవారం ఢిల్లీలోని ఆమె నివాసం ఎదుట ధర్నా చేశారు.
కాంగ్రెస్‌వి చౌకబారు రాజకీయాలు: బీజేపీ
ఈ అంశంలో సుష్మను సమర్థిస్తూ బీజేపీ.. కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేసింది. లలిత్, ప్రధాని మోదీ కలిసివున్న ఫొటోలను విడుదల చేసి కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ నేత, కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. బొగ్గు, 2జీ వంటి స్కాంల నిందితులతో సోనియా, రాహుల్ కలిసివున్న ఫొటోలను తామూ బయటపెట్టగలమన్నారు. సుష్మ చేసిన పని చట్టవ్యతిరేకం, అనైతికం కాదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సమర్థించారు.
నైతిక పాఠాలు చెప్తోంది ఎవరో చూడండి: సుష్మా
ఈ వివాదంలో నైతిక విలువల అంశాన్ని లేవనెత్తిన ఒక టీవీ పాత్రికేయుడిపై సుష్మ ప్రతి విమర్శలు చేశారు. ‘అందరిలోకీ నైతిక విలువల పాఠాలు బోధిస్తోంది ఎవరో చూడండి...’ అని ట్విటర్‌లో అన్నారు.
వజ్‌పై దర్యాప్తు లేదు: బ్రిటన్
లండన్: లలిత్‌కు సుష్మ సాయం చేసిన వివాదంలో భారత సంతతికి చెందిన బ్రిటన్ ఎంపీ కీత్‌వజ్ పాత్రపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయించబోమని ఆ దేశ పార్లమెంటరీ కమిషనర్ ఫర్ స్టాండర్స్ కమిషనర్ కేథరిన్ హడ్సన్ స్పష్టంచేశారు.