’కుంభకోణాలు చేసినవాళ్లూ క్యూ లైన్లో నిలబడ్డారు’
’కుంభకోణాలు చేసినవాళ్లూ క్యూ లైన్లో నిలబడ్డారు’
Published Sun, Nov 13 2016 3:19 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM
పణజి: సంచలన రీతిలో రూ.500, రూ.1000 నోట్లను రద్దచేసిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బలంగా సమర్థించుకున్నారు. ఆదివారం పణజి(గోవా)లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేసిన ఆయన అక్కడ ఏర్పాటుచేసిన సభను ఉద్దేశించి దాదాపు గంటసేపు ప్రసంగించారు.
నోట్ల రద్దు నిర్ణయంతో నల్ల కుబేరుల గుండెలు బద్దలయ్యాయని, అక్రమార్కులు ఎట్టిపరిస్థితుల్లోనూ తనను వదిలిపెట్టరని ప్రధాని మోదీ అన్నారు. అయితే దేశం కోసం కుటుంబాన్ని, సర్వస్వాన్ని త్యాగం చేసిన తనకు ప్రాణాలు లెక్కకాదని, ఎట్టిపరిస్థితుల్లోనూ నల్లధనాన్ని రూపుమాపి తీరతానని ఆయన చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోన్న ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడుతూ..
‘2జీ స్కాం.. బొగ్గు కుంభకోణం.. ఇంకా ఎన్నో అక్రమాలకు పాల్పడిన గత పాలకులకు మోదీ నిర్ణయం రుచించట్లేదు. అలాంటి వాళ్లు కూడా ఇవ్వాళ నగదు కోసం బ్యాంకుల ముందు క్యూ కడుతున్నారు. ఢిల్లీలో ఉండే నాయకుడొకరు రూ.4 వేల కోసం గంటలపాటు బ్యాంకు ముందు లైన్లో నిల్చున్నాడు. ఇదీ.. మా ప్రభుత్వ విజయం. ఏ స్థాయి వ్యక్తులనైనా ఉపేక్షించబోమనడానికి ఇంత కన్నా నిదర్శనం కావాలా?’అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పరోక్షంగా ప్రస్తావిస్తూ మోదీ విమర్శలు సంధించారు. తన దగ్గరున్న పాత నోట్లను మార్చుకునేందు రాహుల్ గాంధీ గత శుక్రవారం పార్లమెంట్ వీధిలోని ఎస్ బీఐకి వచ్చి, గంటపాటు లైన్ లోనే ఉండి కొత్త నోట్లు తీసుకున్న సంగతి తెలిసిందే.
Advertisement