
వచ్చే మూడు నెలలు ప్రధాని మోదీ బిజీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే మూడు నెలలు విదేశీ పర్యటనలతో బిజీబిజీగా గడపనున్నారు. ముందుగా మే 12నుంచి 14 తేదీల్లో శ్రీలంకలోని కొలంబోలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగే బుద్ధపూర్ణిమ వేడుకల్లో మోదీ పాల్గొంటారు. ఈ వేడుకకు దాదాపు వంద దేశాల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. జూన్ మొదటివారంలో రష్యాలో జరిగే ‘సెయింట్‌పీటర్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక’ సదస్సులో పాల్గొంటారు. అటునుంచి జర్మనీ, స్పెయిన్ దేశాలకు వెళ్లి భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై ఆ దేశాధినేతలతో చర్చించనున్నారు.
జూన్ 7 నుంచి 8తేదీలలో కజకిస్థాన్‌లోని అస్తానాలో షాంఘై సహకార సంస్థ నిర్వహించే సదస్సులో పాల్గొంటారు. అదే సమయంలో ఎస్‌సీవోలో సభ్యదేశాలైన రష్యా, చైనా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల పర్యటన తేదీలు ఖరారు కావాల్సిఉన్నాయని ఉన్నతాధికారులు చెప్పారు.
మోదీ పర్యటనలు:
శ్రీలంక: మే 12–14
రష్యా: జూన్ 1– 3
జర్మనీ, స్పెయిన్ (రష్యా పర్యటన అనంతరం)
కజకిస్తాన్: జూన్ 7–8
జర్మనీ: జూలై 7–8.