పోలీస్ మెడల్స్‌లో టాప్ వారే....
న్యూఢిల్లీ: సరిహద్దు లోపల, వెలుపల అత్యంత సాహసోపేతంగా వ్యవహరిస్తూ ఉగ్రవాదులు, సంఘవిద్రోహశక్తులకు చెక్ పెట్టే జమ్మూకశ్మీర్ పోలీసులు, బీఎస్‌ఎఫ్ సిబ్బందికి ఈసారి పోలీస్ శౌర్య పతకాల్లో సింహభాగం దక్కింది. ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పోలీస్ శౌర్య పతకం ఛత్తీస్‌గఢ్‌కు చెందిన శంకర్‌రావుకు లభించింది. 2015 ఏప్రిల్‌లో సుక్మాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయన అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శంచారు. మావోయిస్టులు శంకర్‌రావు ఛాతీపైన కాల్పులు జరిపినా వెన్నుచూపకుండా వారిని వెంటాడారు. నెత్తురోడుతున్నా లెక్కచేయకుండా సహచర పోలీసులను అప్రమత్తం చేసి 35 మంది మావోయిస్టులను మట్టుబెట్టేలా వ్యవహరించారు. మావోయిస్టులతో పోరాడుతూ వీరమరణం పొందారు.
ఇక 190 పోలీస్ శౌర్య పతకాల్లో 40 పతకాలు జమ్మూ పోలీసులు, బీఎస్‌ఎఫ్ జవాన్లను వరించాయి. ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన జమ్మూకు చెందిన ఇద్దరు సీఆర్‌పీఎఫ్ కమాండెంట్స్ చేతన్ సింగ్ చీతా, ప్రమోద్‌కుమార్‌లను ప్రభుత్వం కీర్తిచక్ర పురస్కారంతో సత్కరించింది. 2016 అక్టోబర్‌లో ఆంధ్రా-ఒడిషా సరిహద్దులో ఒకే ఆపరేషన్‌లో 24 మంది మావోయిస్టులను మట్టుబెట్టినందుకు 52 మంది ఏపీ పోలీసులను పోలీసు శౌర్య పతకాలతో గౌరవించింది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర బలగాలకు చెందిన 990 మందికి పోలీస్ పతకాలు లభించాయి.