
కెప్టెన్ చిక్కేనా?
డీఎండీకే అధినేత విజయకాంత్‌కు ఉన్న కనీస ఓటు బ్యాంక్ ఆయనకు ఓ వరం.
డీఎండీకే అధినేత విజయకాంత్‌కు ఉన్న కనీస ఓటు బ్యాంక్ ఆయనకు ఓ వరం. దీంతో ప్రతి ఎన్నికల్లోనూ ఆయన చుట్టూ పార్టీలు తిరగక తప్పడం లేదు. ప్రస్తుతం విజయకాంత్ చుట్టూ మూడు పార్టీలు ప్రదక్షిణ చేసే పనిలో పడ్డారు. ప్రజా కూటమిలోకి ఆయన్ను ఆహ్వానించడమే లక్ష్యంగా రంగంలోకి వైగో దిగారు.
చెన్నై : గతంలో ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొన్న విజయకాంత్ పది శాతం మేరకు ఓటు బ్యాంక్‌ను దక్కించుకున్నారు. దీంతో ఆయనకు 2011 అసెంబ్లీ ఎన్నికల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. చివరకు అన్నాడీఎంకేతో జత కట్టి ఎవ్వరూ ఊహించని రీతిలో ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించారు. ఆ పార్టీతో ఏర్పడ్డ విబేధాలతో బయటకు వచ్చి, చివరకు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పక్షాన చేరారు. ఆ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతైనా తన ఓటు బ్యాంక్‌ను మాత్రం పదిలం చేసుకున్నారు.
ఈ ఓటు బ్యాంకే ప్రస్తుతం విజయకాంత్ చుట్టూ పార్టీలు తిరిగేలా చేస్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయకాంత్ ఓటు బ్యాంక్ తమకు కలసి వస్తాయన్న ఆశాభావంతో తొలుత డీఎంకే వర్గాలు తీవ్రంగానే ఆయన్ను లాగే యత్నం చేశాయి. అయితే, విజయకాంత్ నోరు మెదపలేదు. ఎన్నికల సమయానికి ఆయన తమ వైపునకు తప్పకుండా వస్తారన్న ఆశాభావం డీఎంకే వర్గాల్లో ఉన్నా, ఇటీవలి పరిణామాలు కంగు తినిపించేలా చేస్తున్నాయి.
ప్రజా కూటమి : ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, ఎంఎంకే నేత జవహరుల్లా, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్ ఒకే వేదిక మీదుగా వచ్చి ప్రజా కూటమిని ప్రకటించారు. ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న ఈ కూటమి ఎన్నికల కూటమిగా అవతరిస్తుందన్న ధీమాను పార్టీ నాయకులు చెబుతూ వస్తున్నారు. ఈ కూటమిలోకి డీఎండీకే నేత విజయకాంత్, టీఎంసీ నేత జీకే వాసన్‌లను ఆహ్వానించేందుకు కసరత్తులు సాగాయి. ఈ పరిస్థితుల్లో రెండు రోజుల క్రితం బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి విజయకాంత్‌తో భేటీ కావడం ప్రజా కూటమి వర్గాలకు షాక్ ఇచ్చినట్టైంది. బీజేపీ వైపు ఎక్కడ విజయకాంత్ అడుగులు వేస్తారోనన్న ప్రశ్న బయలు దేరడంతో వారికి చిక్కకుండా విజయకాంత్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు ఎండీఎంకే నేత వైగో రంగంలోకి దిగారు.
రంగంలోకి వైగో: విజయకాంత్‌ను బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి కలిసిన నేపథ్యంలో ప్రజా కూటమికి ఎక్కడ బలం త గ్గుతుందోనన్న ఉత్కంఠ ఆ కూటమి నాయకుల్లో బయలు దేరింది. ఇప్పటికే విజయకాంత్‌తో సీపీఎం నేత రామకృష్ణన్ సంప్రదింపులు జరిపారు. తాజాగా ఎండీఎంకే నేత వైగో రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. విజయకాంత్ , వైగోల మధ్య అన్నదమ్ముల్లా సాన్నిహిత్యం ఉండడంతో వారి సంప్రదింపులకు రంగం సిద్ధం అవుతోంది.
లోక్ సభ ఎన్నికల అనంతరం బీజేపీ చూసిన చిన్న చూపును విజయకాంత్‌కు గుర్తు చేయడం, ఇచ్చిన హామీని విస్మరించి, చేసిన మోసాన్ని , ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాల్ని విజయకాంత్ దృష్టికి తీసుకెళ్లి ఆయన్ను ప్రజా కూటమిలోకి ఆహ్వానించే విధంగా ప్రయత్నాలకు వైగో కార్యచరణ సిద్ధం చేశారు. దీంతో విజయకాంత్ చుట్టూ కూటమి రాజకీయాలు వేడెక్కి ఉన్నాయి. ఈ దృష్ట్యా, విజయకాంత్ ఎవరికి చిక్కుతారోనన్నది మాత్రం మరికొన్నాళ్లు వేచిచూడాల్సిందే. లేని పక్షంలో గతంలో వలే తాను ఎవరికీ చిక్కను అంటూ ఒంటరి నినాదాన్ని అందుకున్నా, అందుకునే అవకాశాలూ ఎక్కువే.