విదేశీ బ్యాంకుల్లో సైతం జీరో బ్యాలెన్స్ అకౌంట్లు
విదేశీ బ్యాంకుల్లో సైతం జీరో బ్యాలెన్స్ అకౌంట్లు
Published Thu, Sep 12 2013 3:35 AM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM
ముంబై: మారుమూల ప్రాంతాల ప్రజలతోసహా దేశంలోని అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్య సాకారం దిశలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం బలహీన వర్గాలకు చెందిన పేదలు సైతం ఇకపై విదేశీ బ్యాంకుల్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ను తెరవవచ్చు. ఈ మేరకు ఆర్‌బీఐ బుధవారం ఒక ప్రకటన జారీచేసింది. ‘తన బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (బీఎస్‌బీడీఏ) మార్గదర్శకాలు భారత్‌లో బ్రాంచీలు కలిగిన విదేశీ బ్యాంకులు సహా అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులకు వర్తిస్తాయని ఆర్‌బీఐ పేర్కొంది. దీనితో పేదలు సైతం హెచ్‌ఎస్‌బీసీ, సిటీబ్యాంక్, స్టాండెర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వంటి విదేశీ బ్యాంకుల్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్లను ప్రారంభించి, ఉచిత ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ సౌలభ్యాన్ని పొందడానికి మార్గం సుగమం అయ్యింది.
నమోదు చేసుకోని ఎన్‌బీఎఫ్‌సీలపై చర్యలు
నియంత్రణ సంస్థలో రిజిస్టర్ చేసుకోకుండా డిపాజిట్లు సమీకరిస్తున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై (ఎన్‌బీఎఫ్‌సీ) కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్‌బీఐ జనరల్ మేనేజర్ (నాన్ బ్యాంకింగ్ విభాగం) అర్చన మంగళగిరి హెచ్చరించారు. బాంబే చార్టర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం 1,263 ఎన్‌బీఎఫ్‌సీలు ఉండగా.. 96 సంస్థలు ఆర్‌బీఐ దగ్గర రిజిస్టరు చేసుకోకుండానే డిపాజిట్లు సమీకరిస్తున్న సంగతి వెల్లడైందని అర్చన పేర్కొన్నారు.
నోట్ల దండలు వద్దు...
కరెన్సీ నోట్లతో దండలు చేసి వాడవద్దని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ప్రజలను కోరింది. పెళ్లిళ్లు, పెద్ద పెద్ద రాజకీయ ర్యాలీలు, మతపరమైన, ఇతర సందర్భాల్లో నోట్ల దండలను ఉపయోగించడం రివాజుగా మారిందని, దీనిని నివారించాలని ఆర్‌బీఐ తాజా ప్రకటన వెల్లడించింది. కరెన్సీ నోట్లను దండలుగా చేయడంవల్ల వాటి రూపం మారిపోతుందని, వాటి మన్నిక తగ్గుతుందని పేర్కొంది. దేశ సార్వభౌమత్వానికి ప్రతీకగా కరెన్సీ నోట్లను గౌరవించాలని, వాటిని దుర్వినియోగం చేయవద్దని సూచించింది. నోట్లు ఎక్కువ కాలం చలామణిలో ఉండేలా వాటిని జాగ్రత్తగా వినియోగించాలని పేర్కొంది. మంచి కరెన్సీ నోట్లను దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలందరూ ఆర్‌బీఐ మంచి నోట్ల విధానానికి తగిన విధంగా సహకరించాలని కోరింది.
Advertisement
Advertisement