వాహన రంగానికి ప్యాకేజీ ఇవ్వండి
న్యూఢిల్లీ: అమ్మకాలు పడిపోతుండటంతో కుదేలైన వాహన రంగాన్ని ఆదుకోవడానికి ప్యాకేజీ అవసరమని భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ మంగళవారం పునరుద్ఘాటించారు. వాహన అమ్మకాలు అంతకంతకూ పడిపోతుండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత 9 నెలలుగా అమ్మకాలు తగ్గుతున్నాయని, దీంతో ఉద్యోగాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ జరిగిన సీఐఐ సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త ఉద్యోగాలివ్వాల్సిన ఈ తరుణంతో ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటినీ ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లామని, వాళ్ల సమస్యలు వాళ్లకున్నాయని వివరించారు.
భారీగా పెరిగిపోతున్న కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) పట్ల ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ, ఏ రూపంలోనైనా ఎంతో కొంత ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తయారీరంగ జీడీపీలో వాహన రంగం వాటా 25 శాతమని, భారీగా ఉద్యోగాలు కల్పిస్తోన్న రంగాల్లో ఇదొకటని పటేల్ చెప్పారు. భారత్‌లో ఆహార భద్రత ఎంత అవసరమో, వాహన రంగ వృద్ధి కూడా అంతే అవసరమని పేర్కొన్నారు.
జూలైలో 7.4 శాతం క్షీణత
ఆర్థిక మందగమనం, కన్సూమర్ సెంటిమెంట్ బలహీనంగా ఉండడం వంటి కారణాల వల్ల గత నెలలో కార్ల అమ్మకాలు 7.4 శాతం తగ్గాయి. అన్ని కేటగిరిల వాహనాల అమ్మకాలు 14,45,112 నుంచి 2.08 శాతం క్షీణించి 14,15,102కు తగ్గాయి. ఆటో రంగాన్ని ఆదుకోవడానికి ప్యాకేజీ కావాలంటూ ఇంతకు ముందే సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియాం) కోరింది. 2008 నాటి సంక్షోభ సమయంలో ఇచ్చిన తరహా ప్యాకేజీని ఇవ్వాలని సియాం సూచిస్తోంది. అప్పుడు చిన్న కార్లు, టూవీలర్లు, వాణిజ్య వాహనాలపై ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని 8 శాతానికి తగ్గించింది.