సాక్షి, ముంబై: తగ్గినట్టే తగ్గి మురిపించిన పసిడి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో వెండి, బంగారం ధరలు సోమవారం ఊపందు కున్నాయి. ముఖ్యంగా కరోనా సంక్షోభంనుంచి బైటపడేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీని అమెరికా పార్లమెంటు దిగువ సభ ఆమోదించిన తరువాత ఫ్యూచర్ మార‍్కెట్లో పసిడి ధరలకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా భారీ ప్యాకేజీ మరింత ద్రవ్యోల్బణానికి దారితీస్తున్న అంచనాలతో డాలర్ క్షీణించింది. దీంతో ఇన్వెస్టర్ల పెట్టుబడులు బంగారం వైపు మళ్లాయి.
ఇది దేశీయంగా కూడా ప్రభావితం చేసింది. ఎంసిఎక్స్‌లో బంగారు ఏప్రిల్ ఫ్యూచర్స్ 0.68 శాతం లేదా 310 రూపాయలు పెరిగి 10 గ్రాముల పసిడి ధర రూ .46,046 వద్ద ఉంది.. సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు 1.13 శాతం లేదా 778 రూపాయలు పెరిగి కిలో 69,562 రూపాయలకుచేరింది. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 400 రూపాయలు పెరిగి రూ. 46,970 వద్ద ఉంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్సు ధర 1,748 డాలర్లకు చేరింది. వెండి 0.3 శాతం పెరిగి 26.71 డాలర్లకు చేరింది. అమెరికా ప్రకటించిన 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ బంగారం ధరలను ప్రభావితం చేస్తుందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ అన్నారు.
కాగా శుక్రవారం స్పాట్ మార్కెట్లో, బంగారం ధరలు 10 గ్రాములకు 342 రూపాయలు తగ్గి 45,599 రూపాయల వద్ద ఎనిమిది నెలల కనిష్టానికి చేరాయి. అలాగే 2 వేల రూపాయలకు పైగా క్షీణించిన వెండి కిలోకు రూ .67,419 కు పడిపోయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment