సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ధోరణి నేపథ్యంలో భారతీయ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. అమెరికా అధ్యక్షుడిగా జో బైడైన్ ప్రమాణ స్వీకారం, భారీ ఉద్దీపన ప్యాకేజీ రానుందన్న అంచనాల మధ్య ప్రపంచ మార్కెట్లలో బంగారం రేట్లు పాజిటివ్‌గా ఉన్నాయి. అలాగే యుఎస్ డాలర్ బలహీనంగా ఉండటం కూడా పుత్తడి ధరలకు కలిసి వచ్చింది.
ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.28శాతం పెరిగి రూ. 49,119 కు చేరుకోగా, వెండి కిలోకు 0.39 శాతం పెరిగి 66,295 కు వద్ద ఉంది. స్పాట్ మార్కెట్‌లో 10 గ్రాముల పసిడి 198 రూపాయల లాభంతో 48480 వద్ద ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర 10గ్రాములకు 45,800 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960 పలుకుతోంది. గ్లోబల్‌గా గోల్డ్ రేట్లు ఔన్సుకు 0.5 శాతం లాభపడి పెరిగి 1,848 డాలర్లకు చేరుకుంది. ఇటీవల నాలుగువారాల గరిష్టాన్ని తాకిన డాలర్ కరెక్షన్ కారణంగా మరింత బలహీనపడింది. ఈ దిద్దుబాటు బంగారానికి మద్దతిస్తోందని, అలాగే అదనపు ఉద్దీపన ప్యాకేజీ రానుందన్న యూఎస్ ట్రెజరీ సెక్రటరీ నామినీ జానెట్ యెల్లెన్ వ్యాఖ్యలు డాలర్‌పై ఒత్తిడి పెంచాయని కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్,హెడ్ రవిందర్‌రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment