శిక్షణ పూర్తిచేసుకున్న ఐపీఎస్‌లకు రాష్ర్టపతి ప్రణబ్ ఉద్బోధ
సాక్షి, హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్‌పటేల్ ఆశయాల సాధన కోసం ప్రొబెషనరీ ఐపీఎస్‌లు కృషి చేయాలని, ఆయన ఆశయాలు ఇప్పటికీ ఆచరణీయాలేనని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. పటేల్ చెప్పినట్లుగా పోలీసులు, సివిల్ సర్వీసు అధికారులు రాజకీయాలు, మతతత్వ కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. అవినీతి, పక్షపాతంగా వ్యవహరించకుండా విధులను నిర్వర్తించాలని సూచించారు. మంగళవారమిక్కడ సర్దార్ వల్లభాయ్‌పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 65వ బ్యాచ్‌కి చెందిన 136 మంది ఐపీఎస్ ప్రొబెషనరీ అధికారులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఐపీఎస్ ప్రొబెషనరీల పాసింగ్ అవుట్ పరేడ్‌లో గౌరవ వందనం స్వీకరించారు. ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేసేందుకు పోలీసులు మరింత సమర్థంగా పనిచేయాలన్నారు. దేశ సమగ్రతకు భంగం కలిగించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
‘‘భారత పోలీసులకు గర్వించదగ్గ చరిత్ర ఉంది. పోలీసులంటే చట్టాలను అమలుపరిచేవారు మాత్రమే కాదు. దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంది. దేశంలో అభివృద్ధి, శాంతియుత వాతావరణం కల్పించడంలో పోలీసుల పాత్రే కీలకం. పోలీసుల పనితీరు దేశ ప్రతిష్టను పెంచేలా ఉండాలి’’ అని అన్నారు. మహిళలు, బాలలపై జరుగుతున్న అత్యాచారాలు, నేరాలను అరికట్టేందుకు కేంద్రం కొత్త చట్టాలను రూపొందించిందని వివరించారు. పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారికి కఠిన శిక్షలుపడేలా చట్టాలను సవరించినట్లు తెలిపారు. పాసింగ్ అవుట్ పరేడ్‌లో రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, మంత్రి జె.గీతారెడ్డి, డీజీపీ బి.ప్రసాదరావు, పోలీసు అకాడమీ డెరైక్టర్ సుభాష్ గోస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఆల్ రౌండర్‌గా షాలినీ అగ్నిహోత్రి
పాసింగ్ అవుట్ పరేడ్‌కు కమాండర్‌గా వ్యవహరించిన షాలినీ అగ్నిహోత్రి అంతర్గత శిక్షణ సమయంలో అనేక అవార్డులు పొంది ఆల్ రౌండర్‌గా నిలిచారు. హిమాచల్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన షాలినీ ఏకంగా ఏడు అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న మొత్తం 136 మంది ఐపీఎస్ ప్రొబెషనరీలలో 114 మంది పురుషులు, 22 మంది మహిళలు ఉన్నారు. 25 ఏళ్లులోపు వారు 8 మంది ఉన్నారు. 25-28 వయస్సు మధ్యలో 52 మంది ఉన్నారు. గతంలో వివిధ ఉద్యోగాల్లో ఉండి ఐపీఎస్‌కు ఎంపికైనవారు 104 మంది ఉన్నారు. వీరితోపాటు రాయల్ భూటాన్ ప్రొబెషనరీలు 04, మాల్దీవులకు చెందినవారు 03, నేపాల్‌కు చెందిన ఐదుగురు కూడా శిక్షణ పూర్తిచేసుకున్నారు.
రాష్ట్రపతికి వీడ్కోలు..
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రెండ్రోజుల రాష్ట్ర పర్యటన ముగిసింది. నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ అధికారుల పరేడ్‌లో పాల్గొన్న అనంతరం ఆయన నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. గవర్నర్ నరసింహన్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, ఎంపీలు వి.హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, వివేక్ తదితరులు రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు. రాష్ట్ర పర్యటనను ముగించుకుని వెళుతున్న రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీకి వీడ్కోలు చేప్పే కార్యక్రమానికి సీమాంధ్ర మంత్రులు, నేతలు ముఖం చాటేయడం చర్చనీయాంశమైంది.