ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్చడం తగదు
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చి కాళేశ్వరం వద్ద బ్యారేజీ నిర్మించి నీటిని మళ్లించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం తీవ్రంగా తప్పుపట్టింది. రాష్ట్రం మొత్తమ్మీద గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాణహిత నీటిని గాటుకు కట్టి.. కాళేశ్వరం నుంచి నీటిని తీసుకొని నిధులను ఎత్తిపోస్తారా? అని సూటిగా ప్రశ్నించింది. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు సరిగా జరగనందువల్లే తుమ్మిడిహెట్టిపై ఆ రాష్ట్రం అభ్యంతరాలు లేవనెత్తిందని.. ఇప్పటికైనా సీఎం సుహృద్భావ చర్చలకు పూనుకోవాలని సమావేశం సూచించింది.
తప్పుడు నివేదికలిచ్చిన ‘వ్యాప్కోస్’పై న్యాయ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. నీళ్లపై అనుమానాలను నివృత్తి చేయాలన్న ఉద్యమకారులను పిచ్చోళ్లు, సన్నాసులు అన్న కేసీఆర్.. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. తుమ్మిడిహెట్టి వద్దే ప్రాణహిత పథకాన్ని చేపట్టాలని తీర్మానం చేసింది. గురువారం ప్రాణహిత-చేవెళ్ల-కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదనలపై తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ నేతృత్వంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.
దీనికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, టీడీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్, బీజేపీ తరఫున ప్రేమ్‌చంద్రారెడ్డి, రిటైర్డ్ జడ్డి జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ జల సాధన సమితి నేత నైనాల గోవర్ధన్, న్యూడెమోక్రసీ నేత వెంకటేశ్వర్‌రావు, ఓయూ జేఏసీ నేతలు దుర్గం భాస్కర్, ఆదిలాబాద్ జిల్లా నేతలు, ఉద్యమకారులు పాల్గొన్నారు.
‘రాష్ట్రంలోని సహజ వనరులన్నింటినీ తాను, హరీశ్, కేటీఆర్, కవిత పంచుకుంటే నాల్గున్నర కోట్ల జనాలకు పంచినట్లే అన్న ధోరణి కేసీఆర్‌లో కనిపిస్తోంది. ఇది సరికాదు. ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి వద్దే బ్యారేజీ కట్టాలి’
- మల్లు భట్టి విక్రమార్క
‘20 శాతం పనులు చేస్తే పూర్తయ్యే ప్రాజెక్టులను విస్మరించి కొత్త ఎత్తిపోతలు చేపట్టే అవసరం ఏమొచ్చింది. కేవలం కమీషన్ల కోసమే కేసీఆర్ ఇదంతా చేస్తున్నారు’
- పెద్దిరెడ్డి, టీడీపీ
‘తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి వరకు నీటిని తరలించవచ్చు. అదే కాళేశ్వరం అయితే నీటిని ఎత్తిపోయాలి. నిధులు ఎత్తిపోసేందుకే కాళేశ్వరం అంటున్నారు కేసీఆర్’
- నైనాల గోవర్ధన్, జల సాధన సమితి
‘తుమ్మిడిహెట్టి వద్ద చిన్న బ్యారేజీ, కాళేశ్వరం వద్ద మరో బ్యారేజీ అంటే మొత్తంగా రూ. 37 వేల కోట్లు ఖర్చు కాదా? కాబట్టి తుమ్మిడిహెట్టి వద్దే బ్యారేజీ నిర్మించాలి.
- తమ్మినేని వీరభద్రం, సీపీఎం
‘2008లో ఒకమారు ఓ నివేదిక ఇచ్చి ఇప్పుడు దాన్నే తప్పు పడుతూ మరో విధంగా మాట్లాడుతున్న వ్యాప్కోస్‌పై న్యాయ విచారణ జరిపించాలి’
- జస్టిస్ చంద్రకుమార్