నేతలకు ప్రాణ హితం!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/సిద్దిపేట, న్యూస్‌లైన్: ఎన్నికల వేళ మన నేతలకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప్రాణమైంది. వైఎస్సార్ మరణం అనంతరం పనులు ఆగిపోయినా నోరు విప్పని ఏ ఒక్క నాయకుడూ.. ఇప్పుడు మాత్రం జాతీయ హోదా తెస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. ఓట్లు రాల్చుకునేందుకు కొంగజపం చేస్తున్నారు.
జిల్లాలో తాగు, సాగు నీటి అవసరాల తీర్చగల ప్రాణహిత ప్రాజెక్టుకు అన్ని పార్టీలు ఇప్పుడు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెద్దపీట వేశాయి. జాతీయ హోదా కోసం కేంద్రం మీద ఒత్తిడి తెస్తామని టీఆర్‌ఎస్ పార్టీ పేర్కొనగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ నానబెట్టి మళ్లీ అదే అంశాన్ని తెరమీదకు తెచ్చింది.
వైఎస్సార్ చలువే..
2007లో జిల్లాలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రాణహితకు శంకుస్థాపన చేశారు. 2008లో ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. 2014-15 వరకు ప్రాణహిత ప్రాజెక్టును జిల్లాలో పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు.సిద్దిపేట డివిజన్ పరిధిలో 10 నుంచి 15వ ప్యాకేజి వరకు ప్రాజెక్టును రూపొందించారు. ఇందుకు అవరమైన 14.45 వేల ఎకరాల భూమి సేకరించాలని నిర్దేశిత లక్ష్యాన్ని ఎంచుకున్నారు. నీటిపారుదల శాఖ సిద్దిపేట డివిజన్ పరిధిలో 8,552 ఎకరాల అలైన్‌మెంట్ భూ సేకరణను గుర్తించింది.
అప్పటి నుంచి 2014 వరకు ఆరు సంవత్సరాల కాలంలో కేవలం 859 ఎకరాలు మాత్రమే సేకరించారు. కరీంగనర్ జిల్లా మిడ్‌మానేరు నుంచి అంతగిరి రిజర్వాయర్ ద్వారా చిన్నకోడూరు మండలం చెలుకలపల్లి మదిర ఎల్లాయపల్లి వద్ద టన్నెల్ నిర్మాణంతో రిజర్వాయర్ పనులను చేపట్టేందుకు సంకల్పించారు. 2009లో చేపట్టిన టన్నెల్ పనులు నేటికీ కొనసాగుతుండటం సర్కారుకు ప్రాజెక్టు మీదున్న ప్రేమకు నిదర్శనం.
జిల్లాలో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపడుతున్న ప్రాణహిత ప్రాజెక్టు పనులు చిన్నకోడూరు, సిద్దిపేట, తొగుట, కొండపాక, గజ్వేల్, వర్గల్, ములుగు మండలాల్లో కొనసాగనున్నాయి. గజ్వేల్ మండలం దాతర్‌పల్లి, తొగుట మండలం వేములగట్‌లో కాల్వ పనులు రెండేళ్ల కిందట ప్రారంభమైనప్పటికీ నేటికీ నిర్దేశిత గమ్యాన్ని చేరుకోకపోవడం గమనార్హం.
నిరాశాజనకంగా భూసేకరణ...
జిల్లాలో దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రాణహిత చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా డివిజన్‌లో సుమారు 15 వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. కాని నిరాశాజనకంగా సాగుతోంది. చిన్నకోడూరు మండలం అల్లీపూర్, మాచాపూర్, తొగుట మండలం వెములగాట్, ఎటిగడ్డకిష్టాపూర్, గజ్వేల్ మండలంలోని దాతార్‌పల్లి, జగదేవ్‌పూర్ మండలంలోని రాయవరం, అన్నసాగర్, తిగూల్, తిమ్మాపూర్, చిన్నకోడూర్ మండలంలోని అల్లీపూర్, చంద్లాపూర్, పెద్దకోడూర్, చిన్నకోడూర్, రామంచ, సిద్దిపేట మండలంలోని ఇమాంబాద్, తడ్కపల్లి, తొగుట మండలంలోని బండారుపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో భూసేకరణ చేయాల్సి ఉంది.
ప్రాజెక్టు కోసం భూమిని సేకరిస్తున్న అధికారులకు మొదట్లో నష్టపరిహార విషయంలో రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురయ్యాయి. ఎకరానికి 6 లక్షల చొప్పున రైతులు డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వ నిబంధనలను ప్రమాణికంగా చేసుకొని అధికారులు ఎకరాకు సగటున రూ. 3.80 లక్షలను చెల్లిస్తున్నారు.
రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు పట్టించుకోలేదు..
వైఎస్సార్ మరణం తరువాత రెండేళ్ల వరకు ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదు. 2010, 2011 వార్షిక బడ్జెట్‌లో ప్రాణహితకు రూపాయి కూడా కేటాయించలేదు. బడ్జెట్‌లో కేటాయింపులు నిరాశాజనకంగా ఉండడంతో భూసేకరణ, రిజర్వాయర్ల నిర్మాణం, కాల్వ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2009 వరకు ప్రాణహితకు బడ్జెట్‌లో కేటాయింపులు ఉన్నప్పటికీ రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు శీతకన్ను చూపాయన్న విమర్శలు ఉన్నాయి. పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రాణహిత ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి అవుతుందోనని రైతులు వాపోతున్నారు.