
అద్వానీ ప్రశంస ఊహాజనితం
ప్రత్యేక విమానం నుంచి: కోర్టుల్లో దోషులుగా తేలే ప్రజాప్రతినిధులను అనర్హత వేటు నుంచి కాపాడే అర్డినెన్స్ ఉపసంహరణ ఘనతను తనకు కట్టబెడుతూ బీజేపీ నేత అద్వానీ చేసిన వ్యాఖ్య ఊహాజనితమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఆర్డినెన్స్ ఉపసంహరణతో తనకెలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. ‘విపక్ష అభిప్రాయాలపై స్పందించను. నాతో భేటీ కావాలని కోరిన వాళ్లందరికీ అపాయింట్‌మెంట్ ఇచ్చాను. బీజేపీ నేతలు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు నన్ను కలిశారు. ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ వినతులు ఇచ్చారు’ అని చెప్పారు. ఆయన శనివారం బెల్జియం పర్యటన ముగించుకుని విమానంలో టర్కీ వెళ్తూ విలేకర్లతో మాట్లాడారు. ప్రధానితో తన చర్చల గురించి అందరికీ తెలుసని, ఆర్డినెన్స్‌పై తనకు అసంతృప్తి ఉన్నట్లు ఆపాదించకూడదని అన్నారు. ‘ఆర్డినెన్స్‌కు తల్లి కేబినెట్. అది వివేచనతో ఆర్డినెన్స్‌ను వాపసు తీసుకోవాలని నిర్ణయించింది. దీనికి ఎవరు, ఎలా, ఎంతవరకు కారణం అన్నవి ఊహాజనితాలు మాత్రమే’ అని పేర్కొన్నారు. ప్రణబ్ కారణంగానే ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకున్నారని, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కటువైన మాటలతో ప్రధాని, యూపీఏ సర్కారు అధికారాలను కాలరాశారని అద్వానీ విమర్శించడం తెలిసిందే.
నవాజ్ హామీ నిలబెట్టుకోవాలి: పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్ పట్ల సానుకూల వైఖరితో స్పందించడం అభినందనీయమని ప్రణబ్ పేర్కొన్నారు. అయితే ఆయన ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటేనే మెరుగైన సంబంధాలు నెలకొంటాయని స్పష్టం చేశారు. నిధుల లేమితో అమెరికాలో ప్రభుత్వ కార్యాలయాలు మూతపడడంపై స్పందిస్తూ.. ఈ పరిణామం మొత్తం ప్రపంచంపై ప్రభావం చూపుతుందన్నారు. కాగా మూడు రోజల టర్కీ పర్యటన కోసం ప్రణబ్ శనివారం ఇస్తాంబుల్ చేరుకున్నారు. ఆయనకు ఇస్తాంబుల్ వర్సిటీ రాజనీతి శాస్త్రంలో గౌరవ పట్టా ప్రదానం చేసింది.