అరుదైన జాతిరత్నం! | Prime Minister Modi of the BJP parliamentary party in the House of mourning | Sakshi
Sakshi News home page

అరుదైన జాతిరత్నం!

Published Wed, Jul 29 2015 1:25 AM | Last Updated on Fri, Mar 29 2019 5:57 PM

అరుదైన జాతిరత్నం! - Sakshi

అరుదైన జాతిరత్నం!

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సంతాప సభలో ప్రధాని మోదీ
 

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జాతి రత్నమని, దేశం కోసం ఆయన కన్న కలలను సాకారం చేయడమే మనమిచ్చే అసలైన నివాళి అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సాధారణ మనిషిలోని అసాధారణ వ్యక్తిత్వానికి కలాం ప్రతీక అని, అధిష్టించిన పదవులన్నింటికీ వన్నె తెచ్చారని కొనియాడారు. కలాం మృతి నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ మంగళవారం నిర్వహించిన సంతాప సభలో మోదీ ప్రసంగించారు. ‘ఆయన మొదట జాతిరత్నం. ఆ తర్వాతే రాష్ట్రపతి. ఎన్ని అవరోధాలున్నా ఒక మనిషి తలచుకుంటే ఎన్నో గొప్ప విజయాలు సాధిస్తాడనడానికి ఆయన జీవితమే ఒక ఉదాహరణ. బహుముఖ ప్రజ్ఞాశాలి కలాం. ఒక అరుదైన రత్నం ఈ రోజు అదృశ్యమైపోయింది. ఆయన చిన్నతనంలో న్యూస్ పేపర్లు అమ్మారు. ఈరోజు ప్రపంచంలోని వార్తాపత్రికలన్నీ ఆయన గురించే రాశాయి. ఆ భరతమాత ముద్దుబిడ్డ మన నుంచి దూరమవడం తీరని లోటు’ అని అన్నారు.

పేదరిక నిర్మూలన, మతాన్ని అధ్యాత్మికత వైపు నడిపించడమే ఈ ప్రపంచంలోని సమస్యలకు పరిష్కారమని కలాం భావించారన్నారు. ఎంత గొప్ప పదవిలో ఉన్నా.. తనను టీచర్‌గాచెప్పుకునేందుకే కలాం ఇష్టపడేవారని, రాష్ట్రపతిగా పదవీవిరమణ చేశాక మరుసటి రోజు కూడా ఓ కాలేజీలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారన్నారు  ‘కలాం కాదు.. ఆయన వ్యక్తిత్వం మాట్లాడేది. సాధారణ వ్యక్తిలో ఈ అసాధారణ వ్యక్తిత్వం చాలా అరుదు. జీవితంలో ఎన్నో శిఖరాలను అధిరోహించారు. మన మధ్య లేకపోయినా.. మనకు భావి తరాలకు ఆయన ప్రేరణ అందిస్తూనే ఉంటారు’ అని అన్నారు. కార్యక్రమంలో కలాం మృతికి, గురుదాస్‌పూర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపంగా మౌనం పాటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement