ముంబై: బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఇప్పుడో అంతర్జాతీయ సెలబ్రిటీ. 'క్వాంటికో' టీవీ షో హాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. ఓ మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రియాంక ఇచ్చిన పోజు వివాదాస్పదమవుతోంది.
ఈ ముఖచిత్రం కోసం ప్రియాంక ధరించిన టీ షర్ట్ పై రాసి ఉన్న రెప్యూజీ (శరణార్థి), ఇమ్మిగ్రెంట్ (వలసవాది), ఔట్ సైడర్ (బయటి వ్యక్తి) అనే పదాలను కొట్టివేసి.. ట్రావెలర్ (ప్రయాణికుడు) అనే పదాన్ని వదిలేశారు. టీ షర్ట్ పై ఉన్న ఈ రాతలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రాతలు చాలా మొరటుగా ఉన్నాయని, బతకడం అనివార్యమై.. నిత్యం శరణార్థులుగా, వలసవాదులుగా ఇతరదేశాలను ఆశ్రయిస్తున్న వారిని తీవ్రంగా కించపరిచేలా ప్రియాంక పోజు ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకొనే టీవీ నటి అయిన ప్రియాంకకు ఓ శరణార్థి బాధ ఎలా తెలుస్తుందని, అందుకే ఇంత మూర్ఖంగా, జాత్యాహంకార వ్యాఖ్యలతో కూడిన టీ షర్ట్ ధరించి ప్రియాంక పోజు ఇచ్చిందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.