రాష్ట్రంలో సంక్షేమ రంగానికి సంబంధించిన కీలకమైన ప్రతిపాదనలన్నీ ‘కోల్డ్‌స్టోరేజీ’లో మూలుగుతున్నాయి.
జీవోఎం నివేదికలు 3నెలలుగా సీఎం కార్యాలయంలోనే..
పెండింగ్‌లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల కొత్త మార్గదర్శకాలు
హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమ రంగానికి సంబంధించిన కీలకమైన ప్రతిపాదనలన్నీ ‘కోల్డ్‌స్టోరేజీ’లో మూలుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖల ద్వారా అమలుచేస్తున్న వివిధ పథకాల్లో పెద్ద ఎత్తున మార్పులు చేస్తున్నట్లు ప్రకటించినా... వాటిపై ఇంకా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. వీటితోపాటు పలు అభివృద్ధి పనులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం (జీవోఎం)సమర్పించిన ప్రతిపాదనలు 3 నెలలుగా సీఎం వద్ద పెండింగ్‌లో ఉండిపోయాయి. ఎస్సీశాఖ బాధ్యతలను స్వయంగా చూసుకుంటున్న సీఎం కేసీఆర్.. ఆ శాఖకు సంబంధించిన ముఖ్యమైన ప్రతిపాదనలపై ఇంకా నిర్ణయం తీసుకోవడం లేదు. దీంతో పథకాలకోసం ఎదురుచూస్తున్న ప్రజలు నిరాశలో మునిగిపోతున్నారు.
వెలువడని ఆదేశాలు: వివిధ సంక్షేమ శాఖల ద్వారా అమలుచేస్తున్న స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాలకు ఒకేవిధమైన ఆదాయ, వయోపరిమితిని ఖరారు చేయడం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలే రాలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖల పరిధిలోని విద్యాసంస్థలు, హాస్టళ్లలో మార్పులు తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నూతన విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలవుతున్నా ఎటువంటి చలనం లేదు. సంక్షేమశాఖల పరిధిలోని ప్రీమెట్రిక్ హాస్టళ్లలో ప్రవేశాలకు సంబంధించిన తాజా మార్గదర్శకాలు విడుదలే కాలేదు.
ఇలా మరెన్నో ప్రతిపాదనలు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖలకు 2015-16లో అమలు చేయాల్సిన సబ్సిడీ విధానం, బ్యాంక్ లింకేజీ, ఆయా పథకాల నిబంధనలు, ఇంకా తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులు, వ్యక్తిగత రుణ విభాగం కింద గరిష్ట రుణ పరిమితి రూ.10 లక్షలకు పెంపుతో పాటు రాయితీని రూ.5 లక్షలకు పెంచాలని మే 8న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రుల బృందం (జీవోఎం) సమావేశంలో నిర్ణయించారు. తర్వాత మే 14న ఆయా పథకాల్లో మార్పులు, మార్గదర్శకాల్లో చేపట్టాల్సిన సవరణలు, ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, సూచనలతో తుది అంచనాను ఉన్నతాధికారులు రూపొందించి, ప్రభుత్వానికి సమర్పించారు. అయినా ఇంకా కొత్త రాయితీ విధానం ఖరారు కాలేదు. ఇలా అనేక ప్రతిపాదనలపై ఇంకా నిర్ణయాలు వెలువడడం లేదు.