
రైలు చార్జీలను తగ్గించాల్సిందే
లక్నో: సామాన్య ప్రజలపై పెను భారం మోపేలా మోడీ సర్కారు రైలు చార్జీలను ఏకంగా 14.2 శాతం పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం కూడా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు, ధర్నాలు, రైల్‌రోకోలు కొనసాగాయి. పెంచిన చార్జీలను తగ్గించాల్సిందేనంటూ విపక్షాలు రెండో రోజూ రోడ్డెక్కాయి. ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి సదానంద గౌడ దిష్టిబొమ్మలను దహనం చేయడంతోపాటు పలు కూడళ్లలో ధర్నాలు నిర్వహించారు. దీంతో ట్రాఫిక్‌కు మూడు గంటలపాటు తీవ్ర అంతరాయం కలిగింది.
ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక మోడీ నియంత లా వ్యవహరిస్తూ ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఢిల్లీ పీసీసీ చీఫ్ అర్విందర్‌సింగ్ దుయ్యబట్టారు. మోడీ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, చేదు మాత్రలు ఢిల్లీవాసులతోపాటు యావత్ దేశ ప్రజలకు చేటు చేయనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే ప్రయాణ చార్జీల పెంపుతోపాటు సరుకు రవాణా చార్జీలను సైతం 6.5 శాతం పెంచడం వల్ల బొగ్గు సహా ఇతర నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులపై మరింత భారం మోపుతాయన్నారు. అందువల్ల పెంచిన చార్జీలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు పలు జిల్లాల్లో రైళ్లను నిలిపేశారు. ఫలితంగా రాజధాని ఎక్స్‌ప్రెస్, బాగ్ ఎక్స్‌ప్రెస్, జనాయక్ ఎక్స్‌ప్రెస్, నార్త్‌ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ సహా పలు గూడ్సు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కాగా, చార్జీల పెంపును ఖండిస్తూ ముంబై కాంగ్రెస్ ఆదివారం తీర్మానం చేసింది. ఈ నెల 24న ముంబైలో భారీ స్థాయిలో నిరసనలు చేపడతామని తెలిపింది. ప్రభుత్వ చర్యకు నిరసనగా మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ మాణిక్‌రావు ఠాక్రే సోమవారం ముంబైలో టికెట్ లేకుండా ప్రయాణి స్తానన్నారు.
చార్జీల పెంపు అనివార్యం: గడ్కారీ
రైలు ప్రయాణ, సరుకు రవాణా చార్జీల పెంపుపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నా ప్రభుత్వం మాత్రం తమ చర్యను గట్టిగా సమర్థించుకుంటోంది. రైల్వేశాఖ చవిచూస్తున్న నష్టాల నేపథ్యంలో సంస్థ మనుగడకు చార్జీల పెంపు అనివార్యమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. ఆదివారం మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చార్జీల పెంపు నిర్ణయం గత యూపీఏ ప్రభుత్వం తీసుకున్నదేనని గుర్తుచేశారు. దేశాభివృద్ధి దృష్ట్యా కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు. రైల్వే మంత్రి సదానంద గౌడ సైతం గత యూపీఏ సర్కారు నిర్ణయాన్నే తాము అమలు చేశామని ఓ చానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.