
'పశ్చిమ'లో మళ్లీ రెచ్చిపోయిన సైకో
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో సైకో మళ్లీ రెచ్చిపోయాడు. తాజాగా బుధవారం పెనుగొండ మండలం సిద్ధాంతం, చెరుకువాడ గ్రామాల్లో ఇద్దరు మహిళలకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి పరారయ్యాడు. ఆగంతకుని దాడిలో సిద్ధాంతంలో సూర్యకుమారి అనే మహిళ గాయపడింది. పిల్లలు.., పెద్దలు తేడా లేకుండా ఆడవాళ్లను కనిపిస్తే ఇంజక్షన్ గుచ్చుతున్నాడు. ద్విచక్ర వాహనంలో చక్కర్లు కొడుతూ ..రెప్పపాటులో సిరంజితో మందు ఎక్కించి మాయవుతున్నాడు.
ఇంతకీ సైకో ఎందుకు ఆడవారిని టార్గెట్ చేస్తున్నాడు? ఏం మందు ఎక్కిస్తున్నాడన్నది మాత్రం పోలీసులకు సవాలుగా మారింది. ఈ నెల 22న ఉండి మండలంలో ఇద్దరు విద్యార్థులకు, నిన్న ఆరుగురు మహిళలకు ఈ ఆగంతకుడు ఇంజక్షన్లు చేశాడు. ప్రధానంగా మహిళలనే టార్గెట్ చేసుకుని అతడు ఈ ఘటనకు పాల్పడుతున్నాడు. ఆగంతకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.