రూ.10 నాణెంపై ఆర్బీఐ క్లారిటీ
రూ.10 నాణెంపై ఆర్బీఐ క్లారిటీ
Published Tue, Feb 7 2017 6:51 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
హైదరాబాద్ : రూ.10 నాణెం చట్టబద్ధత గురించి సాధారణ ప్రజానీకంలో కొంతమంది వ్యక్తులు రేపుతున్న పుకార్లను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కొట్టిపారేసింది. రూ.10 నాణెలను చట్టబద్ధత కలిగినవని, ప్రజలు తమ లావాదేవీల్లో వీటిని స్వీకరించవచ్చని సెంట్రల్ బ్యాంకు స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొందరు వ్యక్తులు, రూ.10 నాణెం చట్టబద్ధత గురించి వర్తకులు, దుకాణదారులు, సాధారణ ప్రజానీకంలో ఆందోళనలు రేపిన సంగతి తెలిసిందే. ఈ పుకార్లను కొట్టిపారేస్తూ రిజర్వు బ్యాంకు రూ.10 నాణెంపై క్లారిటీ ఇచ్చింది. '
''భారత ప్రభుత్వ టంకశాలల్లో తయారైన రూ.10 నాణెంలను రిజర్వు బ్యాంకు చలామణిలోకి తెస్తోంది. ఈ నాణెంలు ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయి. ప్రజల లావాదేవీల అవసరాలను తీర్చడం కోసం, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక విషయాలను ప్రతిబింబించేలా కొత్త డిజైన్, కొత్త డినామినేషన్లలో నాణెంలను తరచుగా ప్రవేశపెడుతుంటాం. ఎక్కువ కాలం ఇవి చలామణిలో ఉంటాయి కనుక ఒకే సమయంలో వివిధ డిజైన్లు, వివిధ ఆకృతులు కలిగిన నాణెంలు చలామణిలో ఉండొచ్చు. జూలై 2011 లో రూపాయి చిహ్నంను ప్రవేశపెట్టడం కూడా ఇలాంటి ఒక మార్పే. కొత్త రూ.10 నాణెం రూపాయి గుర్తు కలిగి ఉంటుంది. పాత రూ. 10 నాణెంలు రూపాయి గుర్తు కలిగి ఉండవు. కానీ ఈ రెండు రకాల నాణెంలు చట్టబద్దమైనవే, లావాదేవీలకు అర్హమైనవే'' అని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తెలిపింది.
Advertisement
Advertisement