పురందేశ్వరి,మాగుంట రాజీనామాల ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పురందేశ్వరి, ఒంగోలు లోక్సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామాలను ఆమోదించారు. విజయవాడ లోక్సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రాజీనామాను కూడా ఆమోదించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లు నిన్న లోక్సభలో ఆమోదం పొందడంతో వీరు ముగ్గురూ తమ లోక్సభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ ఆమోదించారు.
నిన్న లోక్సభలో బిల్లు ఆమోదం పొందడంతో పురందేశ్వరి మంత్రి పదవికి రాజీనామా చేసి, పార్టీ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సీమాంధ్రల అభిప్రాయాలను గౌరవించకుండా లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన తీరు సరిగా లేనందునే పార్టీని వీడుతున్నట్లు ఆమె తెలిపారు.
లోక్సభలో బిల్లు ఆమోదం పొందటంతో లగడపాటి లోక్సభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను స్పీకర్ మీరాకుమార్ బుధవారం ఆమోదించారు. లగడపాటి రాజీనామా లేఖను స్పీకర్ సభలో చదివి వినిపించారు. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం చేస్తానన్న లగడపాటి, ఆ మాట ప్రకారం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా ఇదే అంశంపై లోక్సభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.