అమెరికా, ఈయూలకు పుతిన్ చెప్పుదెబ్బ సమాధానం
''తమలపాకుతో మీరొకటంటే తలుపు చెక్కతో నే రెండంటా'' అంటూ తమ మీద ఆంక్షలు విధించిన పాశ్చాత్య దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ దీటుగా సమాధానం ఇచ్చారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ నుంచి తమ దేశంలోకి మొత్తం అన్ని రకాల పండ్లు, కూరగాయలు, ఆహార దిగుమతులను నిషేధించారు. అటు అమెరికాకు, ఇటు యూరోపియన్ దేశాలకు కూడా రష్యాయే అతిపెద్ద ఆహార పదార్థాల కొనుగోలుదారు. దాంతో ఇప్పుడు ఆ దేశాలన్నింటికి గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లు అయ్యింది. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్లుగా పుతిన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రచ్ఛన్నయుద్ధం నాటి పరిస్థితులు దాదాపుగా మళ్లీ ఏర్పడేలా ఉన్నాయి.
తమ దేశం మీద ఆంక్షలు విధించిన దేశాల నుంచి ఆహార, వ్యవసాయోత్పత్తుల దిగుమతులను నిషేధించే డిక్రీ మీద పుతిన్ బుధవారం నాడు సంతకం చేశారు. ఏడాది పాటు ఈ నిషేధం కొనసాగుతుంది. యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చే కూరగాయల్లో 21.5 శాతం, పండ్లలో 28 శాతం రష్యాయే దిగుమతి చేసుకుంటుంది. ఇది అతిపెద్ద మార్కెట్ కావడంతో అదంతా ఆగిపోతే ఇప్పుడు ఆ దేశాల ఆర్థిక పరిస్థితే అతలాకుతలం అవుతుంది. అలాగే, అమెరికా నుంచి ఎగుమతి అయ్యే చికెన్లో 8శాతం ఒక్క రష్యాకే వెళ్తుంది. దాంతో అమెరికా ఆదాయానికి కూడా బాగానే గండిపడుతుంది.