అల్ జజీరాను మూసేయాల్సిందే!
అల్ జజీరాను మూసేయాల్సిందే!
Published Sat, Jun 24 2017 6:30 PM | Last Updated on Mon, Aug 20 2018 3:56 PM
దుబాయ్: ఖతార్‌ను ఇప్పటికే బహిష్కరించిన అరబ్ దేశాల్లో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఈజిప్టు దేశాలు తమ 13 డిమాండ్లను నెరవేర్చాల్సిందిగా అల్టిమేటమ్ జారీ చేశాయి. అందుకు పది రోజుల గడువును విధించాయి. ఆ డిమాండ్లలో ఖతార్‌లోని అల్ జజీరా మీడియా నెట్‌వర్క్‌ను, దాని అనుబంధ సంస్థలన్నింటిని మూసివేయాలని ముందుగా డిమాండ్ చేసింది.
తీవ్రవాద సంస్థలతో సంబంధాలు పెట్టుకోక పోవడం, దేశంలో నిర్మిస్తున్న టర్కీ వైమానిక స్థావరం పనులను తక్షణం నిలిపివేయడం, ఇరాన్‌తో దౌత్య సంబంధాలను కుదించుకోవడం, తమ నాలుగు దేశాలకు చెందిన పౌరులకు ఖతార్ పౌరసత్వం ఇవ్వడం నిలిపివేయడం ప్రధాన డిమాండ్లు. ఈ డిమాండ్ల చిట్టా శుక్రవారం నాడే తమకు అందిందని, వాటిని పరిశీలిస్తున్నామని ఖతార్ ప్రభుత్వం తెలిపింది. అరబ్, తమ దేశాల మధ్య కువైట్ మధ్యవర్తిత్వం వహిస్తున్నందున ఆ దేశానికే తమ సమాధానం చెబుతామని ప్రభుత్వం పేర్కొంది.
డిమాండ్లు చూడబోతే అంతర్జాతీయ టెర్రరిజాన్ని అరికట్టడంకన్నా తమ దేశ సార్వభౌమాధికారాన్ని కుదించడమే లక్ష్యంగా కనిపిస్తోందని ఖతార్ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కొన్ని డిమాండ్లు అంతర్జాతీయ మానవ హక్కులు, వాటి ఒడంబడికలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని ఖతార్ జాతీయ మానవ హక్కుల సంఘం ఆరోపించింది.
కాగా ఖతార్‌ను బహిష్కరించిన సోదరు అరబ్ దేశాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన 'అల్ జజీరా' టీవీ చానెల్‌పై పడ్డాయి. 'అల్ జజీరా' చానెల్‌ను వెంటనే మూసివేయాలని అల్టిమేటం జారీచేశాయి. ఉగ్రవాదాన్ని ఎగదొస్తున్నదనే ఆరోపణలతో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఈఏ), ఈజిప్టు, బ్రహెయిన్ దేశాలు ఖతార్‌తో పూర్తిగా దౌత్య సంబంధాలు తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement