న్యూఢిల్లీ : కృష్ణపట్నం సహా మూడు అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులను (యూఎంపీపీ) రిలయన్స్ పవర్‌కి (ఆర్‌పవర్) కట్టబెట్టడంపై విచారణ జరపాలని పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సిఫార్సు చేసింది. కృష్ణపట్నంతో పాటు తిలయ్యా, ససాన్ ప్రాజెక్టులకు అర్హతలేని ఆర్‌పవర్‌ను ఎంపిక చేయడం జరిగిందని వ్యాఖ్యానించింది.
స్థల సమీకరణలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ జార్ఖండ్‌లోని తిలయ్యా ప్రాజెక్టు నుంచి రిలయన్స్ పవర్ వైదొలిగిన మర్నాడే పీఏసీ ఈ మేరకు నివేదికను పార్లమెంట్‌కు సమర్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది.అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు కాంట్రాక్టులు ఇచ్చిన తీరుపై కాంగ్రెస్ నేత కేవీ థామస్ సారథ్యంలోని పీఏసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
కనీస సాంకేతిక అర్హతలు కూడా లేని రిలయన్స్ పవర్‌కు ఒక్కోటి 3,960 మెగావాట్ల సామర్థ్యం ఉండే ప్రాజెక్టులను కట్టబెట్టారని ఆక్షేపించింది. పెపైచ్చు ససాన్ ప్రాజెక్టుకు కేటాయించిన చౌక బొగ్గును, ఖరీదైన బొగ్గు వాడాల్సిన ఇతర ప్రాజెక్టు కోసం మళ్లించుకోవడానికి ఆర్‌పవర్‌ని అనుమతించడాన్ని కూడా పీఏసీ తప్పు పట్టింది. ససాన్ ప్రాజెక్టుకి బొగ్గు కేటాయింపులు తక్షణమే నిలిపివేయాలని పేర్కొంది.
మరోవైపు, ఈ అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున తామేమీ వ్యాఖ్యానించబోమని రిలయన్స్ పవర్ ప్రతినిధి పేర్కొన్నారు. నాలుగు యూఎంపీపీల్లో ముంద్రా ప్రాజెక్టును టాటా పవర్ దక్కించుకోగా, మిగతా మూడింటిని ఆర్‌పవర్ దక్కించుకుంది.
ఆర్‌పవర్‌కి అల్ట్రా ప్రాజెక్టుల అర్హతే లేదు: విచారణకు పీఏసీ సిఫార్సు
Published Thu, Apr 30 2015 2:18 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement