ఆయనకు దమ్ములేక.. చెల్లిని తెచ్చుకున్నారా?
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ తనపై విమర్శలు గుప్పించడంతో.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దానికి దీటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో కూడా రాహుల్ గాంధీ నాయకత్వ లోపం గురించి బాగా తెలుసేమోనని, అందుకే ఆయన తన సొంత గడ్డ మీద తనను తాను రక్షించుకోలేక.. అదనపు ఆయుధాలను (చెల్లెలు ప్రియాంక) తెచ్చుకున్నారా అని స్మృతి ఇరానీ ప్రశ్నించారు.
ఇక అమేథీలో ట్రిపుల్ ఐటీ గురించి ప్రస్తావిస్తూ.. ప్రియాంక సరిగా హోం వర్కు చేసుకోకుండా అమేథీ వెళ్లినట్టున్నారని, ట్రిపుల్ ఐటీ అలహాబాద్కు చెందిన ఒక ఆఫ్ క్యాంపస్ అమేథీలో ఉందని ఆమె గుర్తుచేశారు. గడిచిన ఆరు దశాబ్దాలుగా తమకు పెట్టని కోటగా ఉన్న అమేథీకి గాంధీ కుటుంబం ఏమీ చేసిన పాపాన పోలేదని.. ఇది అత్యంత దారుణమని ఆమె అన్నారు. పైపెచ్చు.. అమేథీలో గెలిచిన అభ్యర్థి.. అక్కడ ఓడిపోయిన తనను ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా అడుగుతున్నారని, ఇదెక్కడి విడ్డూరమని కేంద్రమానవ వనరుల శాఖ మంత్రి ప్రశ్నించారు.