
మళ్లీ మొదలైన బతుకమ్మ గిన్నిస్ సంరంభం!
హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక వేడుక బతుకమ్మ పండుగ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో ఎక్కేందుకు సన్నద్ధమవుతుండగా.. కాసేపు వరుణుడు అడ్డుపడ్డాడు. భారీగా వర్షం కురువడంతో ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన మహా బతుకమ్మ వేడుకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. వర్షం వెలియడంతో మళ్లీ బతుకమ్మ సందడి మొదలైంది.
ఎల్బీ స్టేడియంలో శనివారం మహా బతుకమ్మ వేడుక కోసం ప్రభుత్వం సకల ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గిన్నిస్ బుక్ రికార్డు లక్ష్యంగా పదివేల మందితో బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు చేశారు. 20 అడుగుల ఎత్తుతో మహా బతుకమ్మను తీర్చిదిద్దారు. 35 వరుసల్లో పదివేల మంది మహిళలు బతుకమ్మ ఆడేలా వీలు కల్పించారు. మహిళలు, చిన్నారులు సంప్రదాయ దుస్తులు ధరించి.. రంగురంగులో పూలతో పేర్చిన బతుకమ్మలను తీసుకొని ఎల్బీ స్టేడియం చేరుకున్నారు. మైదానం నిండా సందడి వాతావరణం నెలకొంది.
’బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో’ అంటూ భక్తిపారవశ్యంతో పాటలు పాడుతూ.. చూడముచ్చటగా మహిళలు బతుకమ్మ ఆడుతున్నారు. తీరొక్క పూల బతుకమ్మలతో పండుగ శోభతో ఎల్బీ స్టేడియం ప్రాంగణం కళకళలాడుతోంది.