
రాజమౌళి తండ్రిపై చెక్‌బౌన్స్ కేసు కొట్టివేత
యలమంచిలి: ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తండ్రి, సినీ కథా రచయిత కె.వి.విజయేంద్రప్రసాద్‌కు చెక్‌బౌన్స్ కేసు నుంచి విముక్తి లభించింది. విజయేంద్రప్రసాద్‌పై పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు దాఖలుచేసిన చెక్‌బౌన్స్ కేసును కొట్టివేస్తూ యలమంచిలి ఏజేఎఫ్‌సీఎం కోర్టు న్యాయమూర్తి యజ్ఞనారాయణ గురువారం తీర్పు వెల్లడించారు.
సినీ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావుకు 2011 మే 16న విజయేంద్రప్రసాద్ రూ.30 లక్షలకు ఇచ్చిన ఆంధ్రాబ్యాంకు చెక్కు చెల్లకపోవడంతో యలమంచిలి ఏజెఎఫ్‌సీఎం కోర్టులో కేసు దాఖలు చేశారు. నాలుగేళ్ల పాటు ఈ కేసు విచారణ ఇక్కడ కోర్టులో జరిగింది. వాదోపవాదనల అనంతరం సరైన ఆధారాలు లేనికారణంగా విజయేంద్రప్రసాద్‌ను నిర్దోషిగా న్యాయమూర్తి ప్రకటించారు.
బుధవారమే ఈ కేసులో తీర్పు వెల్లడిస్తారని అంతా భావించారు. అయితే విజయేంద్రప్రసాద్ కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి తీర్పును గురువారానికి రిజర్వ్ చేశారు. విజయేంద్రప్రసాద్ కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించడంతో స్థానిక న్యాయవాదులతో పాటు హైకోర్టుకు చెందిన ప్రముఖ న్యాయవాదులతో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన కోర్టుకు హాజరయ్యారు.