బీజేపీతో ఎల్‌జేపీ జట్టు!
గుజరాత్ అల్లర్లలో మోడీ పాత్రపై
మాట్లాడాల్సిన అవసరం లేదు: పాశ్వాన్
త్వరలోనే పొత్తుపై ప్రకటన వచ్చే అవకాశం
న్యూఢిల్లీ/పాట్నా: గుజరాత్ అల్లర్ల తర్వాత ఎన్డీఏను వీడిన రాంవిలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) మరోసారి బీజేపీతో జట్టు కట్టనుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీహార్లో బీజేపీ పొత్తుతో బరిలోకి దిగనుంది. ఈ పొత్తు విషయంపై మూడు, నాలుగు రోజుల్లోనే పాశ్వాన్ తుది నిర్ణయం తీసుకుని, ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఆర్‌జేడీ, ఎల్‌జేపీలతో లౌకికవాద కూటమిని ఏర్పాటు చేయాలనుకున్న కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలినట్టయింది. ప్రత్యామ్నాయ పొత్తులపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ చీఫ్ రాంవిలాస్ పాశ్వాన్‌కు కట్టబెడుతూ బుధవారం సమావేశమైన ఎల్‌జేపీ పార్లమెంటరీ బోర్డు తీర్మానించిందని ఆ బోర్డు అధినేత చిరాగ్ పాశ్వాన్ విలేకరులకు తెలిపారు. బీజేపీతో పొత్తు అవకాశం ఉందా అన్న ప్రశ్నకు.. తమకు అన్ని అవకాశాలు తెరిచే ఉన్నాయన్నారు. ఆర్‌జేడీతో తమ సంబంధం తెగిపోయిందని ఎల్‌జేపీ నేత రామ సింగ్ ప్రకటించారు. బీజేపీతో తమ పొత్తు చర్చలు ఫలప్రదమయ్యే దిశగా సాగుతున్నాయని కూడా వెల్లడించారు. ఎల్‌జేపీతో పొత్తు చర్చలు ఒక కొలిక్కివచ్చినట్లు బీజేపీ వర్గాలు చెప్పాయి. ఎల్‌జేపీ తొమ్మిది సీట్లు కోరగా ఏడు సీట్లు కేటాయించడానికి బీజేపీ అంగీకరించిందని తెలిసింది.
మోడీతో ఇబ్బంది లేదు: ఎల్‌జేపీ చీఫ్ రాంవిలాస్ పాశ్వాన్ మాట్లాడుతూ.. ఆర్‌జేడీతో తమకు ఎంతోకాలం నుంచి ఇబ్బంది ఉందని, అయినా లాలూ జైల్లో ఉన్నపుడు తాను వెళ్లి ఆయన్ను కలసి వచ్చానని చెప్పారు. లాలూ బయటకి వచ్చిన తర్వాత తమకు మూడు సీట్లు మాత్రమే ఇస్తామంటూ ఆ పార్టీ ప్రచారం చేస్తోందని, దీనిపై కాంగ్రెస్ ప్రతిస్పందన కోసం కొన్ని నెలల నుంచి వేచి చూశామని చెప్పారు. అసలు వాళ్లు తమను పట్టించుకున్నట్లే కనిపించడంలేదన్నారు. తమ పార్టీ ఆదర్శమైన లౌకికవాదం నుంచి పక్కకు తొలిగే ప్రశ్నేలేదన్నారు. 2002లో అలాంటి ప్రశ్న ఉత్పన్నమైనపుడు ఎన్‌డీఏ నుంచి వైదొలిగామని గుర్తుచేశారు. అప్పటి అల్లర్లలో మోడీ పాత్ర గురించి ప్రస్తావించగా.. ఆ కేసులో కోర్టు మోడీకి క్లీన్‌చిట్ ఇచ్చినపుడు ఇక ఆ విషయం గురించి మాట్లాడే అవసరం ఉండదన్నారు.
రంగంలోకి సీబీఐ!: ఒకపక్క ఎన్డీఏతో పాశ్వాన్ చర్చలు జరుపుతుండగా.. మరోపక్క బొకారో ఉక్కు కర్మాగారంలో జరిగిన ఉద్యోగ భర్తీలో పాశ్వాన్ హస్తంపై సాక్ష్యాలు సేకరించేందుకు సీబీ ఐ రంగంలోకి దిగింది. పాశ్వాన్ కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఉద్యోగాలు దక్కించుకున్న వారు
సమర్పించిన పత్రాల్లో ఆయన సిఫారసులు బయట పడ్డాయని సీబీఐ వర్గాలు తెలిపాయి.