కొత్త కంపెనీల రాకకు మరికొన్నాళ్లు.. | Randstad India appoints Moorthy Uppaluri as CEO | Sakshi
Sakshi News home page

కొత్త కంపెనీల రాకకు మరికొన్నాళ్లు..

Published Thu, Dec 19 2013 3:23 AM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM

కొత్త కంపెనీల రాకకు మరికొన్నాళ్లు.. - Sakshi

కొత్త కంపెనీల రాకకు మరికొన్నాళ్లు..

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కొత్త కంపెనీల రాకకు మరికొంత సమయం పట్టొచ్చని మానవ వనరుల సేవల సంస్థ రాండ్‌స్టాడ్ ఇండియా సీఈవో మూర్తి కె. ఉప్పలూరి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఇక్కడ ఉన్న సంస్థలు యథాప్రకారంగానే కొనసాగుతాయని.. అయితే, కొత్తగా వచ్చేవే కాస్త ఆలోచనలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఇప్పుడు అనిశ్చితి తొలగుతున్నందున అవి త్వరలో నిర్ణయం తీసుకోగలవ ని బుధవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన తెలిపారు. కొత్త సంస్థల పెట్టుబడుల రాకతో మరిన్ని ఉద్యోగాల కల్పన జరగగలదన్నారు. హైదరాబాద్, వైజాగ్ సహా దేశవ్యాప్తంగా తమకు ముఫ్ఫై ఆరు శాఖలు ఉన్నాయని మూర్తి వివరించారు. ప్రస్తుతం దేశీయంగా సుమారు 60,000 మంది తమ సంస్థ ద్వారా ఉద్యోగాలు చేస్తున్నారన్నారు.
 
 ఈ ఏడాది ద్వితీయార్థంతో పోలిస్తే వచ్చే ఏడాది హైరింగ్ పెరగగలదని మూర్తి తెలిపారు. వృద్ధి అవకాశాలు మెరుగుపడుతుండటం తదితర అంశాలు ఇందుకు తోడ్పడతాయన్నారు. హెల్త్‌కేర్, ఫార్మా, బ్యాంకింగ్..ఆర్థిక సర్వీసుల సంస్థల్లో ఎక్కువగాను, ఐటీలో మధ్యస్థంగా.. టెలికం, ఆటోమొబైల్ వంటి రంగాల్లో కొంత కనిష్టంగా నియామకాలు ఉండగలవని మూర్తి అంచనా వేశారు. ప్రస్తుతం దేశ జనాభాలో ఒక్క శాతం మంది మాత్రమే కన్సల్టెన్సీ వంటి వాటి ద్వారా ఉద్యోగాలు పొందుతున్నారని, ఇతర దేశాలతో పోలిస్తే ఈ విభాగంలో 40 రెట్లు వృద్ధికి అవకాశం ఉందని మూర్తి వివరించారు. తాము ఉద్యోగార్థుల నుంచి ఎటువంటి రుసుములు వసూలు చేయబోమని, అలా  వసూలు చేసే వాటిని కట్టడి చేసేందుకు దేశీయ స్టాఫింగ్ ఫెడరేషన్ ప్రయత్నాలు చేస్తోందన్నారు. మరోవైపు, అంతర్జాతీయంగా తమ కంపెనీ ద్వారా ఆరు లక్షల మంది ఉద్యోగాలు చేస్తుండగా, ఆదాయాలు సుమారు 17 బిలియన్ యూరోల పైగా ఉన్నాయని  రాండ్‌స్టాడ్ ఇండియా చైర్మన్ పాల్ వాన్ డి కెర్‌కాఫ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement