భజనలకొచ్చేవారు రేప్లు చేయరు
పనాజీ: దైవ ప్రసంగాలకు హాజరు కావడం ద్వారా మహిళలపై దాడులు, అత్యాచారాలను నివారించవచ్చని గుజరాత్కు చెందిన మత ప్రబోధకుడు మోరారీ బాపు అన్నాడు. అదొక్కటే ఇలాంటి నేరాలను నివారించగల సర్వమార్గమని చెప్పారు. ప్రస్తుతం గోవాలో ఆధ్మాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆయన మాట్లాడుతూ దైవ భజనలకు, ప్రసంగ కార్యక్రమాలకు హాజరయ్యేవాళ్లు లైంగికదాడులకు, వేధింపులకు పాల్పడరని చెప్పారు. అందుకు ప్రధాన కారణం వారి పరిజ్ఞానం విస్తృతమవ్వడమేనని తెలిపారు.
ఎట్టి పరిస్థితుల్లో అన్యాయాలకు, వేధింపులకు, లైంగికదాడులకు ఒక మహిళ శరీరం వస్తువుగా మారకూడదని, పురుషుల ఆలోచన విధానంలో మార్పు రావాల్సి ఉందని చెప్పారు. భజనలకు రావడం ద్వారా ఆ పరిస్థితి మారుతుందని చెప్పారు. తనకు ప్రధాని నరేంద్రమోదీ అంటే చాలా ఇష్టం అని చెప్పిన ఆయన.. ఇప్పటి వరకు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షాన్నివ్వకుండా ఎందుకు చట్టప్రతినిధులు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పారు.