
రేపిస్టులను ఉరి తీయాలి: జయప్రద
పణాజి: అత్యాచారానికి పాల్పడిన వారిని ఉరి తీయాలని లోక్సభ ఎంపీ జయప్రద అభిప్రాయపడ్డారు. తెహాల్కా మాజీ ఎడిటర్ తేజపాల్పై వచ్చిన అత్యాచార ఆరోపణలపై మీడియా అడగ్గా ఆమె పై విధంగా స్పందించారు. ఎవరైనా అత్యాచారానికి పాల్పడితే వారికి ఉరిశిక్షే సరైనదన్నారు. ఒకవేళ అలాకాకపోతే జీవిత ఖైదు విధించాలన్నారు. అవినీతికి కంటే నేరాలే ప్రమాదమన్నారు. ఒక సినిమా నిర్మాణ పనుల్లో భాగంగా గోవాకు వచ్చిన ఆమె ఐఎన్ఎస్ తో మాట్లాడారు. ఉత్తర ప్రదేశ్ లో నేరాలు హెచ్చరిల్లుతున్న నేపథ్యంలో ములాయం సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. అక్కడ పెరుగుతున్న నేరాలతో మహిళలు, పిల్లలు భయ భ్రాంతులకు గురౌతున్నారని తెలిపారు. రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలపై ప్రజలు ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఉందని ఆమె తెలిపారు. ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనే మహిళకు భద్రత కరువైందని అనడం లేదని, ముంబై, కోల్కతా వంటి నగరాల్లో కూడా మహిళకు రక్షణ లేదన్నారు.