టాటాపై మరోసారి స్వామి సంచలన వ్యాఖ్యలు
రాయపూర్ : టాటా- మిస్త్రీ వివాదంలో ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి మరోసారి టాటా చైర్మన్ పై ధ్వజమెత్తారు. టాటా గ్రూపు చరిత్రలోనే రతన్ టాటా అంత అవినీతి పరుడు లేడంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాయపూర్ లో మీడియాతో మాట్లాడిన స్వామి, అసలు రతన్ టాటా టాటానే కాదు, ఆయన తండ్రి ఓ దత్త పుత్రుడంటూ మరింత అగ్గిని రాజేశారు. కేవలం తనను తాను రక్షించుకోవడానికే సైరస్ మిస్త్రీకి ఆయన అన్యాయం చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ సందర్భంగారెండు నెలల క్రితం సైరస్ మిస్త్రీని టాటాల బోర్డు ఎంతో మెచ్చుకుందన్న విషయాన్ని స్వామి గుర్తు చేశారు. ఎంటైర్ బోర్డు అతని కృషిని ప్రశంసించిందని పేర్కొన్నారు. దీంతో అసూయతోనే రతన్ టాటా ఈ చర్యలకు దిగారని ఆరోపించారు. 2012 లో టాటా సన్స్ చైర్మన్ అయిన సైరస్ మిస్త్రీపై లేనిపోని, దారుణమైన ఆరోపణలు, నిరూపించలేని వాదనలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
2జీ, ఎయిర్ ఆసియా, విస్తారా భాగస్వామ్య ఒప్పందం, జాగ్వార్ డీల్ వంటి కుంభకోణాల్లో రతన్ టాటాకు పాత్ర ఉందని స్వామి ఆరోపించారు. ఈ స్కాముల్లో ఇరుక్కోకుండా తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే మిస్త్రీని తొలగించా రన్నారు. కానీ చట్టం నుంచి రతన్ టాటా తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసారని చెప్పారు. రతన్ టాటా అవినీతిపై భారతీయ శిక్షా స్మృతి ప్రకారం ఏయే సెక్షన్లు వర్తిస్తాయో తెలిపానన్నారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని , సిట్ తో విచారణ జరిపించాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు.