రద్దయిన నోట్ల వివరాలను తెలపండి: ఆర్బీఐ
ముంబై : రద్దయిన నోట్ల డిపాజిట్లకు సంబంధించి మొత్తం వివరాలు తమకు అందించాల్సిందిగా బ్యాంకులను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశించింది. రద్దయిన నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే గడువు నేటితో ముగియనుండటంతో ఆర్బీఐ ఈ ఆదేశాలు జారీచేసింది. గడువు ముగియనున్న డిసెంబర్ 30వ తేదీతో సహా బ్యాంకు ఖాతాల్లో జమ అయిన పాత నోట్ల వివరాలన్నింటిన్నీ తమకు ఈ-మెయిల్ చేయాలని పేర్కొంది. ఈ మేరకు ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆయా బ్యాంకులు తమ బ్రాంచ్ కార్యాలయాల నుంచి రద్దయిన నోట్ల వివరాలను సేకరించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అదేవిధంగా జిల్లా సహకార సెంట్రల్ బ్యాంకులు(డీసీసీబీ) మినహా మిగతా బ్యాంకు శాఖలన్నీ రద్దయిన నోట్లను 2016 డిసెంబర్ 31 వరకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆఫీసులల్లో లేదా కరెన్సీ చెస్ట్స్(నోట్లను నిల్వ ఉంచే హౌజ్లు)లో జమచేసుకోవాలని ఆర్బీఐ ఆ ప్రకటనలో తెలిపింది. 2016 డిసెంబర్ 31 నుంచి బ్యాంకు నగదు నిల్వల్లో రద్దయిన నోట్లు భాగం కాకూడదని ఆదేశించింది. 2016 నవంబర్ 10 నుంచి 14 వరకు డీసీసీబీలలో డిపాజిట్ అయిన రద్దయిన నోట్లకు తదుపరి ఆదేశాలు జారీచేస్తామని పేర్కొంది.
బ్రాంచ్ల నుంచి సేకరించిన రద్దయిన నోట్లను నిల్వ చేసుకోవడానికీ బ్యాంకులు తగిన కరెన్సీ చెస్ట్స్(నోట్లను నిల్వ ఉంచే హౌజ్లు) లను ఏర్పాటుచేసుకోవాలని సూచించింది. కాగా రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం రూ.14లక్షల కోట్ల పాత నోట్లు డిపాజిట్లు నమోదయ్యాయి. మొత్తం రద్దయిన నోట్లలో ఇది 90 శాతం. నవంబర్ 8 మొత్తం 86 శాతం చలామణిలో ఉన్న రూ.15.4 లక్షల కోట్ల విలువైన రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు. ఈ నోట్లను డిపాజిట్ చేసుకునేందుకు డిసెంబర్ 30 వరకు గడువు విధించిన సంగతి తెలిసిందే.