కీలక వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ
న్యూఢిల్లీ : రిజర్వు బ్యాంకు గవర్నర్గా రఘురామ్ రాజన్ తన చివరి ద్రవ్యపరపతి పాలసీ సమీక్షలో ఎలాంటి సర్ప్రైజ్ లు లేకుండా కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించారు. మెజార్జీ నిపుణులు భావించిన మాదిరిగానే రాజన్ నిర్ణయం వెలువడింది. ఎలాంటి మార్పులు చేయని కీలక వడ్డీ రేట్లు రెపో 6.50 శాతంగా, రివర్స్ రెపో 6 శాతంగా, సీఆర్ఆర్ను 4శాతంగా ఉంచుతున్నట్టు వెల్లడించారు. సెప్టెంబర్ 4న ఆర్‌బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకోనున్న రాజన్‌కు ఇదే చివరి పరపతి విధాన సమీక్షా సమావేశం కానున్న నేపథ్యంలో మంగళవారం నాటి విధాన సమీక్షపై మార్కెట్ వర్గాలు, విశ్లేషకులు ఎక్కువగా దృష్టిసారించారు.
రాజ్యసభ, లోక్సభలు ఆమోదించిన ఏకీకృత వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలుతో బిజినెస్ సెంటిమెంట్ పెరుగుతుందని, పెట్టుబడులు మరింతగా ఆకర్షించవచ్చని రాజన్ చెప్పారు. అధిక వడ్డీ రేట్లు కొనసాగిస్తున్నారని తనపై ఆరోపణలు చేస్తున్న విమర్శకుల గురించి తానేమీ మాట్లాడదలుచుకోలేదని... ప్రజలనుంచి తనకు పూర్తి మద్దతు ఉందని తెలిపారు. ఆర్బీఐ గవర్నర్గా తనకు ఆఖరిక్షణం వరకూ అంతా పాజిటివ్ అనుభూతే కలగాలని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇదే తన చివరి పాలసీ కావడంతో తనకున్న తక్కువ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటానని ద్రవ్య పరపతి సమీక్షలో వెల్లడించారు.
అధిక వడ్డీ రేట్లు కొనసాగిస్తున్నారన్న విమర్శల వల్ల చివరి పాలసీలో రేట్లకు కొంత మేర కోత పెట్టొచ్చని కొందరు ఆర్థికనిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు. అయితే ఎవరిని ఎలాంటి ఆశ్చర్యానికి లోనుచేయకుండా ముందటి పాలసీ మాదిరిగానే కీలక రేట్లలో ఎలాంటి మార్పుల చేపట్టలేదు. మరోవైపు రాజన్కు, ఆర్బీఐకు ఇదే చివరి ద్రవ్య పరపతి సమీక్ష. వచ్చే పాలసీ నిర్ణయం ప్రభుత్వం నియమించే మానిటరీ పాలసీ కమిటీ ప్రకటించనుంది. తదుపరి సమీక్షా సమావేశం అక్టోబర్ 4న జరగనుంది.