
ఖాతాదారులకు శుభవార్త!
న్యూఢిల్లీ: డిమానిటైజేషన్ తర్వాత నగదు విత్ డ్రా పరిమితులతో ఇబ్బందులు పడ్డ ఖాతాదారులకు శుభవార్త. త్వరలోనే విత్ డ్రా పరిమితిని పెంచేందుకు కేంద్రం యోచిస్తోంది. పెద్దనోట్ల రద్దు తర్వాత విధించిన నగదు విత్ డ్రా పరిమితులను పెంచే అవకాశం ఉందని ఆర్బీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ వారంలో క్యాష్ విత్ డ్రాలను సమీక్షించనున్న రిజర్వు బ్యాంకు ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
పొదుపు ఖాతా పరిమితి దాదాపు రూ.30-35 వేలకు వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే కరెంట్ ఖాతాలోని నగదు ఉపసంహరణను వారానికి రూ. 50 వేలనుంచి కూడా పెంచనున్నట్టు అంచనా. ఇప్పటివరకు పొదుపు ఖాతాల విత్ డ్రా పరిమితి రూ. 24 వేలు మాత్రమే.
కాగా డిమానిజేషన్ నేపథ్యంలో నగదు కష్టాలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం దశల వారీగా వివిధ వెసులు బాటులను కల్పిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఇటీవల ఏటీఎం ఉపసంహరణలను రోజుకు రూ.2500 నుంచి రూ.4,500 కు పెంచిన సంగతి తెలిసిందే. అయితే విత్ డ్రా లిమిట్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తారా లేదా అనేది ఇంకా అస్పష్టమే.