వడ్డించిన విస్తరేనా? | RBI's surprise rate cut | Sakshi
Sakshi News home page

వడ్డించిన విస్తరేనా?

Published Sun, Jan 18 2015 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

వడ్డించిన విస్తరేనా?

వడ్డించిన విస్తరేనా?

 మున్ముందు వడ్డీరేట్లు మరింత తగ్గే సంకేతాలు
 రుణాలు తీసుకునే వారికైతే ఇది వరమే
 డిపాజిట్లు చేసి వడ్డీపై ఆధారపడ్డ వారికే కష్టం
 అలాంటి వారికి దీర్ఘకాలిక డిపాజిట్లే మేలు
 రుణాలు తీసుకునేవారికి ఫిక్స్‌డ్ కన్నా ఫ్లోటింగ్ రేటే బెటర్
 కొన్ని రంగాల ఈక్విటీలవైపూ చూడొచ్చంటున్న నిపుణులు

 
 సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం : ఇరవై నెలల తరవాత ఉన్నట్టుండి ఆర్‌బీఐ కీలక రేట్లను పావుశాతం మేర తగ్గించింది. అంతేకాక... మున్ముందు మరింతగా తగ్గే అవకాశాలున్నాయని కూడా సంకేతాలిచ్చింది. ఆర్‌బీఐ తమకు వడ్డీరేట్లను తగ్గించింది కనుక తాము సైతం కస్టమర్లకు వడ్డీ రేట్లు తగ్గిస్తామని బ్యాంకులు చెబుతున్నాయి. ఇపుడిపుడే ఒకదానివెంట ఒకటిగా బ్యాంకుల ప్రకటనలు వెలువడుతున్నాయి. ఇక నిపుణులేమో వడ్డీరేట్లు మున్ముందు మరింత తగ్గుతాయని నమ్మకంగా చెబుతున్నారు. మరిపుడు సామాన్యులు ఏం చేయాలి? డిపాజిట్లు పెట్టేవారు వడ్డీ రేట్లు తగ్గుతాయి కనుక ఇప్పుడే పెట్టాలా? లేక వేరే ప్రత్యామ్నాయాలు చూసుకోవాలా? రుణాలు తీసుకునేవారు వడ్డీ రేట్లు తగ్గుతాయి కనుక కొన్నాళ్లు ఆగాలా? మరి ఇప్పటికే రుణాలున్నవారు ఏం చేయాలి? ఇప్పటికే డిపాజిట్లున్నవారు ఏం చేయాలి? ఇవన్నీ సందేహాలే!! సామాన్యుల్లోని ఈ సందేహాలన్నిటినీ తీర్చడానికి ‘సాక్షి’ పలువురు నిపుణులను సంప్రదించింది. వారు చెప్పిన సూచనల సమాహారమే ఈ వారం ‘ప్రాఫిట్’ ప్రధాన కథనం.
 
 ఫిక్స్‌డ్ మాయలో పడొద్దు..
 రిజర్వుబ్యాంకు కీలక వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో చాలా బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని తమ కస్టమర్లకు అందించడానికి సిద్ధమయ్యాయి. ఆర్‌బీఐ రేటుకు అనుగుణంగా పావు శాతం వరకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి కొన్ని బ్యాంకులు ఇప్పటికే మిగతా బ్యాంకులకన్నా కాస్త తక్కువ వడ్డీకి రుణాలిస్తున్నాయి. కాబట్టి ఆ బ్యాంకులు తాజాగా వడ్డీని తగ్గించే అవకాశాలు ఉండవన్నది నిపుణుల మాట. సాధారణంగా ఇరవై ఏళ్ళ కాలానికి తీసుకున్న గృహ రుణంపై వడ్డీరేటు పావు శాతం తగ్గితే ప్రతి లక్షకు నెలకు రూ.17 చొప్పున ఈఎంఐ తగ్గుతుంది. లేదంటే 3 నుంచి 4 నెలల ఈఎంఐ మిగులుతుంది. అదే ఐదేళ్ల వాహన రుణమైతే ఈఎంఐ లక్షకు రూ.25 చొప్పున తగ్గుతుంది.
 
 ఉదాహరణకు ఒక బ్యాంకులో  ఇరవై ఏళ్ల కాలానికి ఇరవై లక్షల గృహ రుణంపై వడ్డీ రేటు 10.75%గా ఉందనుకుందాం. ఈ రేటు ప్రకారం ప్రతి నెలా రూ.20,375 ఈఎంఐ చెల్లించాలి. ఆర్‌బీఐ వడ్డీరేటు తగ్గించిన విధంగా ఈ బ్యాంకు కూడా వడ్డీరేటు పావు శాతం తగ్గిస్తే 10.5%కే గృహరుణం లభిస్తుంది. అంటే  ఈఎంఐ రూ.19,968 చెల్లిస్తే సరిపోతుందన్న మాట. దీని వలన ఇరవై ఏళ్ళలో చెల్లించే వడ్డీ భారం రూ.81,000 వరకు తగ్గుతుంది. వడ్డీ రేట్లు గరిష్ట స్థాయి నుంచి ఇప్పుడిప్పుడే తగ్గడం ప్రారంభం కావడంతో రుణాలు తీసుకునే వారు ఫిక్స్‌డ్ కంటే ఫ్లోటింగ్ రేటును ఎంచుకోవటమే ఉత్తమం. దీని వలన వడ్డీరేట్లు తగ్గిన కొద్దీ ఈఎంఐల సంఖ్య కూడా తగ్గుతుంటుంది. అదే ఫిక్స్‌డ్ తీసుకుంటే వడ్డీరేట్లు తగ్గుతున్నా ఆ ప్రయోజనం వర్తించదు. ఇప్పుడు బ్యాంకులు ఫిక్స్‌డ్ రేట్లలో ఆకర్షణీయంగా రుణ పథకాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ మాయలో పడకుండా అన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకోండి.
 
 డిపాజిట్లలో దీర్ఘకాలమైతే మంచిదే...
 ఎటువంటి నష్ట భయం లేకుండా స్థిరాదాయాన్ని పొందాలనుకునే వారికి ఆర్‌బీఐ నిర్ణయం కాస్త ఇబ్బంది పెట్టేదే. రానున్న కాలంలో వడ్డీరేట్లు ఇంకా తగ్గే అవకాశం ఉందన్న సంకేతాలు వస్తున్నాయి. అందుకోసం డిపాజిట్లు పెట్టేవారు ఇప్పుడే అధిక స్థిర వడ్డీ రేట్లుండే దీర్ఘకాలిక డిపాజిట్ల కేసి చూడటం మంచిది. నిజానికి దీర్ఘకాలిక డిపాజిట్లతో పోలిస్తే స్వల్పకాలిక డిపాజిట్లపై వడ్డీ ఎక్కువే వస్తోంది. ఎందుకంటే వడ్డీ రేటు కాస్త తక్కువుంది. కానీ వడ్డీపై ఆధారపడేవారు భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా దీర్ఘకాలిక డిపాజిట్లలోనే ఇన్వెస్ట్ చేయడం మంచిదనేది నిపుణుల సలహా. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ డిపాజిట్లనే తీసుకుందాం. ఎస్‌బీహెచ్ 1-3 ఏళ్ళ కాలపరిమితి గల డిపాజిట్లపై అత్యధికంగా 8.80 శాతం వడ్డీని అందిస్తోంది.
 
 అదే ఐదేళ్ళు దాటిన డిపాజిట్లపై 8.75% వడ్డీనే ఇస్తోంది. ఇప్పుడు అయిదు పైసలు అధిక వడ్డీకి ఆశపడి మూడేళ్ళ డిపాజిట్‌కు వెళితే ఆ కాలపరిమితి తీరిన తర్వాత వడ్డీరేట్లు ఇంకా బాగా తగ్గితే నష్టపోయే ప్రమాదం ఉంది. రానున్న కాలంలో వడ్డీరేట్లు ఇంకా తగ్గే అవకాశం ఉంది కనుక సాధ్యమైనంత వరకు గరిష్ట కాలానికి డిపాజిట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో అధిక ప్రయోజనం పొందవచ్చు. సాధారణంగా సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు పావు శాతం నుంచి అర శాతం వరకు అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. మీ ఇంట్లో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే వారి పేరిట డిపాజిట్ చేయడం ద్వారా అధిక వడ్డీ ప్రయోజనం పొందొచ్చు.  డిపాజిట్లపై వచ్చే వడ్డీని ఆదాయంగా పరిగణిస్తారు కనుక తక్కువ ఆదాయం ఉన్న కుటుంబ సభ్యుల పేరు మీద డిపాజిట్ చేయండి.
 
 బ్యాంకు పేరు    కాలపరిమితి(సం...)    అందిస్తున్న వడ్డీ(%)
 ఆంధ్రా బ్యాంక్    2-10    8.5
 ఎస్‌బీహెచ్    5-10    8.75
 ఎస్‌బీఐ    3-5    8.5
 ఐసీఐసీఐ    390 రో- 5సం.    8.75
 హెచ్‌డీఎఫ్‌సీ    1-5    8.75
 
 రుణాలున్న రంగాలకేసి చూడొచ్చు
 బడ్జెట్ తర్వాత గానీ వడ్డీరేట్లు తగ్గవని అంతా అనుకుంటున్నాం. ఈ సమయంలో ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం నిజంగానే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వడ్డీరేట్లు తగ్గుతాయనే అంశాన్ని మార్కెట్లు ఇప్పటికే పరిగణనలోకి తీసుకున్నా.. ఇంత వేగంగా నిర్ణయం తీసుకోవడం మాత్రం మార్కెట్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు వచ్చే ఏడాది కాలంలో ఎంత మేర తగ్గుతాయన్న దానిపైనే వడ్డీ రేట్లతో ముడిపడి ఉన్న రంగాల షేర్లు పెరగటమా? తగ్గటమా? అన్నది జరుగుతుంది. వడ్డీరేట్లతో నేరుగా ప్రభావం ఉన్న బ్యాంకులు, అధిక రుణాలున్న విద్యుత్, ఇన్‌ఫ్రా, క్యాపిటల్ గూడ్స్‌తో పాటు, ఈఎంఐ భారం తగ్గే హౌసింగ్, ఆటో మొబైల్ రంగాల షేర్ల కేసి చూడొచ్చు. వడ్డీరేట్లు తగ్గడం వల్ల బ్యాంకుల ఎన్‌పీఏలు తగ్గడం, రుణ వితరణ పెరగడం వంటి లాభాలే కాకుండా బాండ్ ఈల్డ్స్ పెరగడం వల్ల ఇతర ఆదాయాలు పెరుగుతాయి.
 
  కాబట్టి వడ్డీరేట్లు తగ్గడం వల్ల అత్యధిక ప్రయోజనం పొందేది బ్యాంకింగ్ రంగమేనని చెప్పొచ్చు. వ్యాపారం బాగున్నా వడ్డీరేట్లు పెరగడం వల్ల బ్బంది పడ్డ రంగాలు కూడా ప్రయోజనం పొందుతాయి. అధిక రుణం ఉందన్న కారణంతో కాకుండా విద్యుత్, ఇన్‌ఫ్రా, క్యాపిటల్ గూడ్స్ రంగాల్లో మంచి పనితీరు కనపర్చే కంపెనీల షేర్ల కేసి చూడొచ్చు. ఇవి కాకుండా వడ్డీరేట్లు తగ్గడం వల్ల ఈఎంఐ భారం తగ్గి అమ్మకాలు పెరిగే అవకాశం ఉన్న హౌసింగ్, ఆటోమొబైల్, వినియోగ రంగాలు కూడా బాగుండే అవకాశముంది. ఇవన్నీ రానున్న కాలంలో వడ్డీరేట్లు మరింత తగ్గుతాయన్న అంచనాతో పెరిగే అవకాశాలున్నాయి. కానీ ఈ అంచనాలు తలకిందులైతే మాత్రం అదే విధంగా పతనమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.
   - సతీష్ కంతేటి, జేఎండీ, జెన్‌మనీ
 
 మీడియమ్ టర్మ్ డెట్ ఫండ్స్ బెస్ట్
 వడ్డీరేట్లు తగ్గే ప్రయోజనాన్ని డెట్ ఫండ్ల ద్వారా కూడా పొందవచ్చు. ఎలాగంటే వడ్డీరేట్లు తగ్గితే బాండ్ ఈల్డ్స్ పెరుగుతాయి.. ఆ మేరకు ఇన్వెస్టర్లకు రాబడి పెరుగుతుంది. రానున్న కాలంలో వడ్డీరేట్లు మరింత తగ్గితే గవర్నమెంట్ సెక్యూరిటీస్, గిల్ట్ ఫండ్స్ వంటివి మంచి రాబడిని అందిస్తాయి. కానీ వీటిల్లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఐదేళ్ళ డెట్ ఫండ్స్‌లో కూడా రిస్క్ రివార్డ్ రేషియో ఎక్కువనే చెప్పొచ్చు. ఇంత దీర్ఘకాలానికి రిస్క్ చేసే వారు వీటికేసి చూడొచ్చు. ఎక్కువ రిస్క్ చేయలేని వారు తగ్గుతున్న వడ్డీరేట్ల నుంచి ప్రయోజనం పొందాలంటే షార్ట్ అండ్ మీడియం టర్మ్ ఫండ్స్‌ను ఆశ్రయించొచ్చు. ఒకటిన్నర నుంచి రెండేళ్ళ కాలపరిమితి గల డెట్ ఫండ్స్ రానున్న కాలంలో స్థిరంగా అధిక రాబడులను అందిస్తాయని చెప్పొచ్చు. ఊహించని విధంగా ఆర్‌బీఐ వడ్డీరేట్లును వేగంగా తగ్గిస్తే అదే స్థాయిలో రాబడులు కూడా పెరుగుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లిక్విడ్, అల్ట్రా షార్ట్‌టర్మ్ ఫండ్స్‌కు దూరంగా ఉండటమే బెటర్. ఇప్పటికే ఈ విభాగాల రాబడులు తగ్గడం మొదలయ్యాయి. కొద్దిగా తెలివిగా వ్యవహరిస్తే తక్కువ రిస్క్‌తో డెట్ ఫండ్స్ ద్వారా బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక రాబడిని పొందొచ్చు.
 - బి. శరత్ శర్మ,
 ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement