బ్యాంక్ లెసైన్సు సాధిస్తాం
ముంబై: రిజర్వ్ బ్యాంక్ కొత్తగా జారీ చేసే బ్యాంకింగ్ లెసైన్సుల్లో తాము కూడా ఒకటి దక్కించుకోగలమని రిలయన్స్ క్యాపిటల్ చైర్మన్ అనిల్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. తద్వారా కొత్తగా రిలయన్స్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని, మూడేళ్ల తర్వాత పబ్లిక్ ఇష్యూ చేపట్టి స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్ట్ చేస్తామని ఆయన తెలిపారు. కొత్త బ్యాంక్‌కి వాణిజ్య రుణాల వ్యాపారాన్ని బదలాయించడం ద్వారా రిలయన్స్ క్యాపిటల్ (ఆర్‌క్యాప్) ప్రస్తుత రుణభారం మూడు వంతులమేర తగ్గిపోగలదని అనిల్ వివరించారు. మంగళవారం జరిగిన ఆర్‌క్యాప్ వాటాదారుల వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. బ్యాంక్ మినహా ఆర్‌క్యాప్‌లో మిగతా అనుబంధ సంస్థలు వేటినీ లిస్టింగ్ చేసే యోచనేదీ లేదని ఆయన స్పష్టం చేశారు.
5వేల కోట్లకు తగ్గనున్న రుణం..
ఆర్‌క్యాప్‌కి చెందిన కమర్షియల్ ఫైనాన్స్ వ్యాపారాన్ని ప్రతిపాదిత బ్యాంకుకు బదలాయిస్తామని అనిల్ చెప్పారు. దీంతో ప్రస్తుతం రూ. 20,000 కోట్లుగా ఉన్న కన్సాలిడేటెడ్ రుణభారం రూ. 5,000 కోట్లకు తగ్గగలదన్నారు. ఫలితంగా డెట్-ఈక్విటీ నిష్పత్తి కూడా పరిశ్రమ ప్రమాణాల కన్నా మెరుగ్గా 0.5-1 స్థాయికి తగ్గగలదని వివరించారు. కంపెనీ వద్ద తగినంత మూలధనం ఉందని, మరింతగా సమకూర్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆర్‌క్యాప్ జీవిత బీమా, సాధారణ బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, అసెట్ మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్ వ్యాపారాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తుందని చెప్పారు. ఆర్థికపరమైన అంశాల కన్నా సాంకేతిక నైపుణ్యత రూపంలో లాభించే భాగస్వామ్యాలను కుదుర్చుకునే యోచన ఉందన్నారు. మరోవైపు బ్యాంకులు వివిధ బీమా సంస్థల పథకాలను విక్రయించేందుకు బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ అనుమతించడం సానుకూల అంశమని, దీనివల్ల కోట్లకొద్దీ కస్టమర్లకు ప్రయోజనం చేకూరుతుందని అనిల్ తెలిపారు.
టెలికంలో కన్సాలిడేషన్..
రాబోయే రోజుల్లో టెలికం రంగంలో కన్సాలిడేషన్ జరగగలదని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) వాటాదారుల వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా చైర్మన్ హోదాలో అనిల్ చెప్పారు. జాతీయస్థాయిలో కేవలం నాలుగైదు కంపెనీలు మాత్రమే మిగులుతాయని ఆయన తెలిపారు. ఇక, పెద్దన్న ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌తో సర్వీసులపరంగా పరస్పర సహకారం మరింత పెరగగలదని అనిల్ అంబానీ చెప్పారు. ఆర్‌కామ్ ఇకపై కూడా సీడీఎంఏ సర్వీసులు కొనసాగిస్తుందని.. 4జీ తదితర సేవలు అందించే దిశగా భవిష్యత్‌లో స్పెక్ట్రమ్ వేలంలోనూ పాల్గొంటుందని ఆయన వివరించారు. ప్రస్తుతం 4జీ సేవల కోసం దేశవ్యాప్త స్పెక్ట్రమ్ ఉన్న రిలయన్స్ జియోతో రూ. 14,000 కోట్ల విలువ చేసే రెండు ఒప్పందాలను ఆర్‌కామ్ కుదుర్చుకుందన్నారు.
కొత్త కంపెనీగా ఆర్‌కామ్ రియల్టీ ఆస్తులు..
ఆర్‌కామ్ రియల్టీ ఆస్తులను విడగొట్టి ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయనున్నట్లు అనిల్ తెలిపారు. కొత్తగా ఏర్పాటయ్యే ‘రిలయన్స్ ప్రాపర్టీస్’ని లిస్టింగ్ కూడా చేస్తామని ఆయన చెప్పారు. ఆర్‌కామ్ షేర్‌హోల్డర్లందరికీ.. కొత్త సంస్థ షేర్లను ఉచితంగా ఇస్తామని అనిల్ వివరించారు. ప్రస్తుతం కంపెనీ రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువ సుమారు రూ. 12,000 కోట్లు ఉంటుందన్నారు.