జియో క్యాబ్‌లపై క్లారిటీ ఇచ్చిన రిలయన్స్
ముంబై: యాప్ ఆధారిత టాక్సీ సేవలపై రిలయన్స్ స్పందించింది. బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ టాక్సీ సేవల రంగంలోకి ఎంట్రీ ఇస్తుందన్న వార్తలను రిలయన్స్ వర్గాలు వ్యతిరేకించాయి. ప్రత్యక్షంగా రిలయన్స్ జియో నేరుగా స్పందించ కపోయినప్పటికీ, రిలయన్స్ ప్రతినిధి ఒకరు ట్విట్టర్ ద్వారా ఆ అంశంపై క్లారిటీ ఇచ్చారు. అలాంటి ప్రణాళికలేవీ లేవని వివరణ ఇచ్చింది.
ఓలా, ఉబెర్ సంస్థలకు గట్టి పోటీనిచ్చేలా మరో సరికొత్త క్యాబ్ సర్వీస్ కంపెనీ త్వరలోనే జియో ప్రారంభించనుందన్న వార్తలపై స్పందించిన రిలయన్స్ ప్రతినిధి ఈ వార్తలు తప్పు అంటూ కొట్టి పారేశారు. మరోవైపు రిలయన్స్ జియో సంబంధంలేని రంగంలోకి అడుగుపెట్టే ఆలోచన ఏదీ లేదని రిలయన్స్ అధికారి ఒకరు వివరించారు. జియో ప్రీపెయిడ్ వాలెట్ జియో మనీ ద్వారా టాక్సీ చెల్లింపులకు మాత్రమే అనుమతి ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు. రిలయన్స్ జియో ఈ వారం టాక్సీ అగ్రిగేటర్ ఉబెర్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. జిమో మనీ ద్వారా ఈ ఉబెర్ సేవలను వినియోగించుకుని చెల్లింపులు చేసిన వినియోగదారులకు మరిన్ని ప్రోత్సాహకాలను అందించనున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే.
కాగా 170 రోజుల్లో 100 మిలియన్ల వినియోగదారులను సొంతం చేసుకున్న జియో ప్రారంభ ఆఫర్ లోనే టెలికం రంగంలో సంచలనాలు సృష్టించిన ఎయిర్ టెల్, వొడాఫోన్ వంటి దిగ్గజ కంపెనీలకు సైతం చుక్కలు చూపించింది. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు క్యాబ్ సర్వీసుల మార్కెట్‌లోకి ప్రవేశించే ప్రణాళికలో ఉందన్నవార్తలు ఇటీవల బాగా వ్యాపించాయి. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ క్యాబ్ మార్కెట్‌ను పూర్తిగా స్టడీ చేస్తున్నారనీ జియో క్యాబ్స్ పేరిట సొంత యాప్ ఆధారిత ట్యాక్సీ సర్వీసులను ప్రారంభించనున్నారని నివేదికలొచ్చాయి. ఏప్రిల్లోనే లాంచ్ చేయనున్న ఈ సర్వీసులను మరికొన్ని నెలల్లోనే కమర్షియల్గా అందుబాటులోకి తేనున్నారన్న అంచనాలు బాగా వచ్చాయి. ఇందుకోసం ఇప్పటికే మహింద్రా, హ్యుందాయ్ వంటి కంపెనీలతో సంప్రదింపులు జరిపారనీ, 600 కార్లను కూడా ఆర్డర్ ఇచ్చిందని, తొలుత బెంగళూరు, చెన్నైలో వీటిని ప్రారంభించి అనంతరం ఢిల్లీ, ముంబై విస్తరిస్తుందని వెల్లడించిన సంగతి విదితమే.