కేంద్ర బృందాన్ని పంపిస్తా..
మీ ఇబ్బందులు చెప్పుకోండి
పొగాకు రైతు ప్రతినిధులతో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
పొగాకు రైతుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు
న్యూఢిల్లీ: పొగాకు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు కేంద్రం నుంచి బృందాన్ని పంపిస్తామని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీఇచ్చారు. ఇబ్బందులేమైనా ఉంటే కమిటీకి నివేదించాలని రైతులకు సూచించారు. పొగాకు పంటకు ప్రత్యామ్నాయంపై తానెలాంటి నిర్ణయాన్ని తీసుకోలేనని ఆమె స్పష్టం చేశారు. పొగాకు రైతుల సమస్యల్ని తప్పక పరిష్కరిస్తామని, ధైర్యంగా ఉండాలని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు నేతృత్వంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన రైతు ప్రతినిధుల బృందం శుక్రవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైంది. బీజేపీ ఎంపీ కంభపాటి హరిబాబు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం, గ్రేడింగ్ తక్కువ చేసి చూపడం, ఇతర ఇబ్బందులను ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రైతులు తమ ఇబ్బందుల్ని మంత్రికి వివరించారు. గ్రేడ్‌ను తగ్గిస్తున్నారని, గిట్టుబాటు ధర లభించట్లేదని తెలిపారు. స్టాకును కొనేలా పొగాకు బోర్డును ఆదేశించాలని కోరారు. మంత్రి మాట్లాడుతూ.. రైతుసమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. రైతుల ఇబ్బందులు తెలుసుకోవడానికి సోమ లేదా మంగళవారం కేంద్రబృందాన్ని పంపిస్తానని హామీఇచ్చారు.
మంచి పరిణామం: వైఎస్సార్‌సీపీ ఎంపీలు
పొగాకు రైతు సమస్యలపై కేంద్రమంత్రి సానుకూలంగా విని కేంద్ర బృందాన్ని పంపిస్తామని హామీ ఇవ్వడం మంచి పరిణామమని వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు చెప్పారు.
కేంద్రమంత్రి వెంకయ్యతో భేటీ..
ఇదిలాఉండగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, టీడీపీ ఎంపీ మురళీమోహన్, రైతుసంఘాల ప్రతినిధులు అంతకుముందు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కలసి పొగాకు రైతు సమస్యలపై వినతిపత్రం అందచేశారు. లోయర్, మిడిల్ గ్రేడ్ పొగాకుకు కనీస ధర రూ.96 చొప్పున చెల్లిస్తామని కంపెనీలు ప్రకటించినప్పటికీ గరిష్టంగా రూ.50 నుంచి 70 మాత్రమే ఇస్తున్నాయని చెప్పారు. వెంటనే వెంకయ్యనాయుడు పొగాకు బోర్డు చైర్మన్ గోపాల్‌తో ఫోన్‌లో మాట్లాడి తగు ఆదేశాలు జారీ చేశారు. పొగాకు రైతుల ఇబ్బందులపై వాణిజ్యమంత్రితో, ప్రత్యామ్నాయ పంటలపై వ్యవసాయమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ఆయన రైతులకు హామీఇచ్చారు.