'ప్రభుత్వ పదవులకు దూరంగా ఉండటమే మంచిది'
తిరువనంతపురం: పదవీవిరమణ అనంతరం సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు జ్యూడీషియల్ ఇంక్వైరీ కమిషన్ మినహా అన్ని పదవులకు రెండేళ్ల పాటు స్వచ్ఛందంగా దూరంగా ఉండడం మంచిదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కేటీ థామస్ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సదాశివం కేరళ గవర్నర్‌గా రానున్నారంటూ వార్తలు వస్తుండటంపై సోమవారం థామస్ పై విధంగా స్పందించారు. ఆరు సంవత్సరాల పాటు సుప్రీం న్యాయమూర్తిగా సేవలందించిన థామస్.. 2002 లో పదవీ విరమణ పొందారు.
రాజీనామా చేసిన న్యాయమూర్తులు ప్రభుత్వ పదవులకు దూరంగా ఉండాలన్న నియమనిబంధనలు ఏమీ లేకపోయినా.. ఇది తన అభిప్రాయంగా పేర్కొన్నారు. ప్రజలు ఎప్పుడూ న్యాయవ్యవస్థను నిశితంగా గమనిస్తూ ఉంటారని.. వారికి ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇచ్చే పదవులకు దూరంగా ఉండటమే మంచిదని తెలిపారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివంను కేరళ గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించబోతోందన్న అంశంపై రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చ మొదలైంది. దేశ అత్యున్నత న్యాయ పదవిని అలంకరించిన ఓ వ్యక్తికి గవర్నర్‌గా అధికారాలు అప్పగిస్తే అది అనూహ్య పరిణామమే అవుతుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.