ముగ్గురూ ముగ్గురే.. సూపర్ రికార్డు
ముగ్గురూ ముగ్గురే.. సూపర్ రికార్డు
Published Sat, Sep 3 2016 12:09 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
ఆడపిల్లలకు రక్షణ అందించడంతో పాటు, వారికి విద్యావశ్యకతను చాటిచెప్పుటకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన పథకం బేటీ బచావో, బేటీ పడావో. ఈ పథకానికి మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో ఓ కుటుంబం బ్రాండ్ అంబాసిడర్గా నిలుస్తోంది. నలుగురు కూతుర్లలో ముగ్గురు కూతుర్లు ఒకేసారి డాక్టరేట్ పట్టా తీసుకొని వారి తల్లిదండ్రులకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటును కానుకగా ఇచ్చారు.
రెవా జిల్లాలో అడ్వకేట్ విజయ్ శంకర్ మిశ్రా, గిరిజా మిశ్రాలకు నలుగురు కూతుళ్లు. వారిలో ముగ్గురు కూతుర్లు ఒకేసారి 2014లో అవదేష్ ప్రతాప్ సింగ్(ఏపీఎస్) యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టాలు తీసుకున్నారు. బేటీ బచావో, బేటీ పడావోకు ఈ అక్కాచెల్లెళ్లు ఆదర్శంగా నిలుస్తున్నట్టు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు పేర్కొంది. వారితో పాటు వారి తల్లిదండ్రుల ఫోటోలను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల 2017 ఎడిషన్లో ప్రముఖంగా ప్రచురించనున్నట్టు.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా లేఖను అందుకున్నారు. పెద్ద కూతురు అర్చనా(36).. భారతీయ సాంప్రదాయాల్లో అమ్మాయిల పాత్రపై పరిశోధన నిర్వహించి చరిత్రలో పీహెచ్డీ తీసుకోగా.. అంజనా(33), అన్షు(30) ఇద్దరూ పర్యావరణ శాస్త్రంలో డాక్టరేట్ పొందినట్టు తండ్రి మిశ్రా పేర్కొన్నారు. ఈ ముగ్గురూ ఒకేసారి పీహెచ్డీ పట్టాలు పొందడం విశేషం. ఆడపిల్లల్ని చదివించడానికే వెనుకాడుతున్న వారికి ఈ తల్లిదండ్రులు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని, బేటీ బచావో, బేటీ పడావో స్లోగన్కు నిలువెత్తు నిదర్శంగా అభివర్ణిస్తూ పొగడ్తలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే రిజర్వేషన్ల కారణంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేకపోవడంతో కాలేజీ లెక్చరర్స్గా చేరినట్టు తండ్రి తెలిపారు. ప్రస్తుతం న్యాయ శాస్త్రంలో గ్రాడ్యుయేట్లు పొందిన అర్చనా, అన్షు జ్యుడిషియల్ సర్వీసు ఎగ్జామ్కు సన్నద్ధమవుతున్నారని, అదేవిధంగా అంజనా న్యూఢిల్లీలో సివిల్ సర్వీసు ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతుందని తండ్రి పేర్కొన్నారు.
Advertisement