
ఆర్మీ సేవల్లో ఇక రోబోలు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో రాళ్ల దాడులు, ఉగ్ర దాడులను ఎదుర్కోవడంలో భారత సైన్యానికి త్వరలో రోబోలు సహకరించనున్నాయి. ఉగ్ర దాడులు, అల్లరి మూకల విధ్వంసాలను అదుపు చేసే క్రమంలో సైనికులకు ఎదురయ్యే కష్టనష్టాలను తగ్గించే క్రమంలో రోబోటిక్ వెపన్స్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది.
తమకు 544 రోబోలు అవసరమని సైనిక అధికారులు పంపిన ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదించినట్టు తెలసింది. గత ఎనిమిది నెలలుగా డీఆర్‌డీవో లేబొరేటరీ ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నది. సైనిక కార్యకలాపాల్లో భారత సేనలకు రోబోటిక్ వెపన్స్ వ్యూహాత్మకంగా సహకరిస్తాయని సైనిక వర్గాలు పేర్కొన్నాయి. పలు వాతావరణ, ప్రాదేశిక పరిస్థితుల్లో సైనికులు పనిచేస్తున్న క్రమంలో అందుకు దీటుగా ఈ రోబోలకు రూపకల్పన చేశారు. పలు కీలక స్ధావరాల వద్ద వీటిని మోహరించడంతో పాటు ఇండోర్‌లోనూ ఇవి సేవలు అందించగలవని ఆ వర్గాలు తెలిపాయి.