ప్రభుత్వాన్ని ప్రశ్నించే శక్తినివ్వాలి
కేంద్ర సమాచార కమిషన్ పదో స్నాతకోత్సవంలో ప్రధాని
న్యూఢిల్లీ: ఆర్టీఐ ద్వారా కేవలం సమాచారం తెలుసుకునేందుకే ప్రజలు పరిమితం కాకూడదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రతి పౌరుడికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే శక్తిని ఆ చట్టం అందించాలని అభిలషించారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) దరఖాస్తులను నిర్దిష్ట సమయంలోగా, పూర్తి పారదర్శకంగా పరిష్కరించాలని పేర్కొన్నారు. పాలనను మరింత మెరుగుపరిచేందుకు ఈ చట్టాన్ని వినియోగించాలని సూచించారు. ఆర్టీఐ ద్వారా వచ్చే ఒక చిన్న ప్రశ్న ప్రభుత్వ విధాన నిర్ణయాన్నే మార్చవచ్చని పేర్కొన్నారు. శుక్రవారమిక్కడ కేంద్ర సమాచార కమిషన్ 10వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు.
‘అతి సామాన్యుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కలిగి ఉండడం ప్రజాస్వామ్యానికి పునాదిలాంటిది. ఆర్టీఐ ద్వారా సామాన్యుడు తనకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోగలుతున్నాడు. కానీ అది అంతవరకే ఆగిపోకూడదు. అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించగల హక్కూ అతడు కలిగి ఉండాలి. ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. పారదర్శకత దిశగా ప్రభుత్వం ఎంత వేగంగా ప్రయాణిస్తే ప్రజాస్వామ్యం పట్ల ప్రజల్లో అంత నమ్మకం ఏర్పడుతుంది.
ప్రజల్లో అవగాహన పెరిగితే అది ప్రభుత్వానికి మరింత బలం చేకూరుస్తుంది’ అని అన్నారు. ప్రజలకు సమాచారం అందించే ప్రక్రియ ఎలాంటి కష్టం లేకుండా సరళంగా ఉండాలని పేర్కొన్నారు. ‘ సమాచారం ప్రజలకు తేలిగ్గా అందించేందుకు ప్రభుత్వాలే చొరవ చూపాలి. డాక్యుమెంట్లపై స్వీయ ధ్రువీకరణ(సెల్ఫ్ అటెస్టేషన్) ఉంటే చాలన్న పద్ధతిని ప్రవేశపెట్టాం. ఎందుకంటే ప్రజలను మనం నమ్మాలి. పాతకాలంలో అన్ని వ్యవహారాల్లో గోప్యత పాటించేవారు. కానీ దానికి నేడు కాలం చెల్లిపోయింది’ అని మోదీ చట్టసభల్లో ప్రశ్నోత్తరాల ప్రక్రియ మీడియా దృష్టిలో పడేందుకు లేదా ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునే వ్యవహారంగా మారిపోయిందని మోదీ ఆవేదన వ్యక్తంచేశారు.