రూపాయి పతనం షాకే, కానీ... | Rupee’s fall a worry, but reforms won’t be reversed: PM | Sakshi
Sakshi News home page

రూపాయి పతనం షాకే, కానీ...

Published Sat, Aug 31 2013 12:54 AM | Last Updated on Fri, Sep 1 2017 10:17 PM

రూపాయి పతనం షాకే, కానీ...

రూపాయి పతనం షాకే, కానీ...

రూపాయి ఘోర పతనంపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎట్టకేలకు మౌనాన్ని వీడారు. దేశీ కరెన్సీ కుప్పకూలడం కచ్చితంగా దిగ్భ్రాంతికరమైన విషయమేనని..

  • ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితిపై పార్లమెంట్‌లో ప్రధాని మన్మోహన్ ప్రకటన
  •  కరెన్సీ క్షీణత తాత్కాలికమే... మళ్లీ పుంజుకుంటుంది
  •  సంస్కరణలపై వెనక్కితగ్గం...
  •  పెట్టుబడులపై నియంత్రణల ప్రసక్తే లేదు...  
  •  కఠినమైన సంస్కరణలకు సమయం ఆసన్నమైంది...
  •  
     న్యూఢిల్లీ: రూపాయి ఘోర పతనంపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎట్టకేలకు మౌనాన్ని వీడారు. దేశీ కరెన్సీ కుప్పకూలడం కచ్చితంగా దిగ్భ్రాంతికరమైన విషయమేనని.. అయితే, సంస్కరణల ప్రక్రియ నుంచి వెనక్కితగ్గకుండానే ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీనిచ్చారు. విదేశీ పెట్టుబడులు దేశం విడిచివెళ్లకుండా ఎలాంటి నియంత్రణలూ(క్యాపిటల్ కంట్రోల్) విధించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత దుస్థితికి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే కారణమంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలో పార్లమెంటులో ఆయన శుక్రవారం దీనిపై ఒక ప్రకటన చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం తీవ్రమైన క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్నమాట వాస్తవమేనని, ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతున్నారని కూడా ఆయన ఒప్పుకున్నారు. అయితే, ఇవన్నీ తాత్కాలిక ఇక్కట్లు మాత్రమేనని.. వృద్ధిరేటు గాడిలోపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
     
     అంతర్జాతీయ పరిణామాలూ కారణమే...
     రూపాయి భారీగా కుప్పకూలడానికి దేశీయ అంశాలతోపాటు పలు అంతర్జాతీయ పరిణామాలు కూడా కారణమని ప్రధాని వివరించారు. సవాళ్లను అధిగమించగలమన్నారు.
     
     ఇక కఠిన సంస్కరణలే...
     గడిచిన రెండు దశాబ్దాలుగా ఆర్థిక సరళీకరణ ప్రయోజానాలు భారత్‌కు చాలా మేలు చేకూర్చాయని ప్రధాని వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు ఇప్పటికీ చాలా పటిష్టంగానే ఉన్నాయని.. భారతదేశ అసలుసిసలు సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాల్సిన తరుణం వచ్చిందన్నారు. ఇప్పటిదాకా చేపట్టిన ఆర్థిక సంస్కరణలన్నీ ఒకెత్తయితే.. ఇకపై మరిన్ని కఠిన సంస్కరణలతో ముందుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. దీనికి రాజకీయపక్షాల నుంచి ఏకాభిప్రాయం అవసరమని కూడా చెప్పారు. సంస్కరణలపై  వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
     
     వృద్ధిరేటుపై...
     2013-14లో జీడీపీ వృద్ధిరేటు కాస్త మెరుగ్గానే 5.5 శాతంగా నమోదుకావచ్చని మన్మోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
     
     కీలక సంస్కరణలు అవసరం: కార్పొరేట్లు
     ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంపు, క్యాపిటల్ కంట్రోల్స్ విధించబోమన్న ప్రధాని హామీపై కార్పొరేట్ ఇండియా స్పందించింది. దీనికితోడు జీఎస్‌టీ, సబ్సిడీలకోత ఇతరత్రా పలు కీలక, కఠిన సంస్కరణలను అమలుచేయాల్సిన అవసరం నెలకొందని ఫిక్కీ ప్రెసిడెంట్ నైనాలాల్ కిద్వాయ్ వ్యాఖ్యానించారు. అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు.
     
     పసిడిపై మోజు వద్దు...
     అధిక క్యాడ్(మూల ధన పెట్టుబడులు మినహా దేశంలోకివచ్చే, బయటికిపోయే విదేశీ మారకం నిధుల మధ్య వ్యత్యాసం) దేశానికి ఆందోళనకరంగా పరిణమిస్తోందని ప్రధాని అంగీకరించారు. రూపాయి క్షీణతకు ఇది కూడా ఆజ్యం పోస్తోందన్నారు. పసిడి, ముడిచమురు దిగుమతులు దూసుకెళ్తుండటమే క్యాడ్ పెరుగుదలకు కారణమని చెప్పారు. ప్రజలు బంగారంపై మోజు తగ్గించుకోవాలని, తద్వారా క్యాడ్‌కు కళ్లెం పడుతుందని సూచించారు.
     
     అదేవిధంగా పెట్రో ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించడం, ఎగుమతులను పెంచే చర్యల ద్వారా క్యాడ్‌కు అడ్డుకట్టవేయొచ్చని పేర్కొన్నారు. క్యాడ్‌ను జీడీపీలో 2.5 శాతానికి తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గతేడాది(2012-13)లో క్యాడ్ చరిత్రాత్మక గరిష్టానికి(4.8 శాతం-90 బిలియన్ డాలర్లు) ఎగబాకిన సంగతి తెలిసిందే. కాగా, విదేశీ పెట్టుబడులు దేశంలోకి వచ్చేలా సానుకూల ఆర్థిక వాతావరణాన్ని కల్పించడం ద్వారా క్యాడ్‌ను పూడ్చుకునేందుకు వీలవుతుందన్నారు. 1991 నాటి చెల్లింపుల సంక్షోభానికి భారత్ మళ్లీ చేరువవుతోందన్న ఆందోళనలను ఆయన కొట్టిపారేశారు. దేశ కరెన్సీ మారకం రేటు మార్కెట్ ఆధారితంగానే కొనసాగుతోందని, దేశంలో 278 బిలియన్ డాలర్ల విదేశీ మారక(ఫారెక్స్) నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇవి ఏడు నెలలకు సరిపడా దిగుమతుల బిల్లుకు సమానమని కూడా గుర్తుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement