
ప్రపంచానికి భారత్‌పై నమ్మకం పోయింది
ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా..ప్రభుత్వ పనితీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా..ప్రభుత్వ పనితీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచ దేశాల నమ్మకాన్ని భారత్ కోల్పోయిందన్నారు. పనిలో పనిగా ప్రధాని మన్మోహన్‌సింగ్ సారథ్యంపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. మన్మోహన్‌సింగ్‌పై గౌరవం ఉందంటూనే .. దేశాన్ని ముందుండి నడిపించే సత్తా లోపించిందంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
పీకల్లోతు సమస్యల్లో ఉన్న భారత్.. ప్రపంచ దేశాల నమ్మకాన్ని కోల్పోయిందని రతన్ టాటా ఒక చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చాలా ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిందన్నారు. ప్రైవేట్ రంగంలోని స్వార్థపర శక్తుల ప్రభావానికి ప్రభుత్వం లొంగిపోతోందని ఆక్షేపించిన టాటా .. విధానాలను మార్చేయడం, జాప్యాలు చేయడం లాంటివి చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ప్రధాని మన్మోహన్ సింగ్.. భారత్ గర్వంగా తలెత్తుకునేలా చేశారని, కానీ ఇటీవలి కాలంలో ఆ ప్రతిష్ట మసకబారుతోందని ఆయన చెప్పారు. ఇన్వెస్టర్లకు భారత్‌పై విశ్వాసం సన్నగిల్లుతున్నా.. ప్రధాని మౌనం వహిస్తున్నారన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘మనం ప్రపంచం నమ్మకాన్ని కోల్పోయాం. మన ప్రభుత్వం ఆ విషయాన్ని చాలా ఆలస్యంగా గుర్తించింది’ అని టాటా వ్యాఖ్యానించారు. టాటా గ్రూప్ చైర్మన్‌గా గతేడాది డిసెంబర్‌లో రతన్ టాటా పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే.
విధానాలు సరిగ్గా అమలు కావాలి..
విధానాలను పకడ్బందీగా రూపొందించినట్లుగానే.. వాటిని అమలు కూడా చేస్తే దేశానికి మంచిదని టాటా చెప్పారు. ప్రభుత్వం ప్రకటించే విధానాలను .. ప్రైవేట్ రంగంలోని స్వార్థపూరిత శక్తులు కొన్ని సందర్భాల్లో తమకు అనుకూలంగా మార్చుకోవడమో లేదా వాటి అమల్లో జాప్యమయ్యేలా చూడటమో చేశాయని ఆయన వ్యాఖ్యానించారు. కారణమేదైనా కావొచ్చు ప్రభుత్వం కూడా ఆయా శక్తులకు అనుగుణంగా పనిచేసిందని టాటా విమర్శించారు.
అంతర్గత కుమ్ములాటలపై విచారం...
ప్రభుత్వంలో అంతర్గత కుమ్ములాటలను కూడా టాటా సునిశితంగా విమర్శించారు. ‘ప్రభుత్వాన్ని అందరూ అన్ని వైపులా లాగేస్తున్నారు. అంతర్గతంగా కూడా ఇది జరుగుతోంది. ప్రభుత్వం అన్నాకా ఒక్కతాటిపై ఉండాలి.. కానీ ప్రభుత్వ టీమ్ సభ్యులు తలో దారిలో పోతున్నారు.. మిత్రపక్షాలు తలో దారిలోకి లాగుతున్నాయి.. రాష్ట్రాలు మరో దారిలోకి లాగుతున్నాయి. ప్రభుత్వం ఏకతాటిపై ఉండటం లేదు’ అని టాటా పేర్కొన్నారు.
మోడీపై ఇలా...
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతూ.. ఆయన గుజరాత్‌లో తన నాయకత్వ సామర్థ్యాన్ని ఇప్పటికే నిరూపించుకున్నారని, రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టారని టాటా చెప్పారు. అయితే, జాతీయస్థాయిలో దేశాన్ని ఏ విధంగా నడిపించగలరన్న దానిపై తాను వ్యాఖ్యానించలేనని తెలిపారు.
ప్రధానిపై గౌరవం ఉంది..కానీ...
1991 నాటి సంస్కరణలను రతన్ టాటా ప్రస్తావిస్తూ.. ఇప్పుడున్న బృందమే అప్పట్లో చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని దేశాన్ని ముందుకు నడిపించిందని టాటా పేర్కొన్నారు. కానీ, ప్రస్తుతం కొన్ని శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయన్నారు. అటువంటి శక్తులకు తలొగ్గకుండా.. దేశ ప్రయోజనాలను కాపాడే విధంగా పరిస్థితులను చక్కదిద్దాల్సిన అవసరం ఉందని టాటా అభిప్రాయపడ్డారు. ప్రధాని మన్మోహన్ సింగ్ సారథ్యంపై తనకు అపార గౌరవం ఉందని, ఇకపైనా ఉంటుందని టాటా చెప్పారు. అయితే, దేశాన్ని ముందుండి నడిపించే నాయకత్వం లోపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘మనం ఎలాంటి నాయకత్వం కావాలని కోరుకుంటున్నామో.. దేశాన్ని ముందుండి నడిపించాలనుకుంటున్నామో.. అలాంటి నాయకత్వం లేదు’ అని టాటా వ్యాఖ్యానించారు.