రూపాయి రికవరీ 42 పైసలు అప్, 60.88 వద్ద క్లోజ్
ముంబై: రూపాయికి మద్దతునిచ్చేందుకు ప్రభుత్వం తాజాగా మరిన్ని చర్యలు తీసుకోవచ్చన్న అంచనాలతో దేశీ కరెన్సీ మారకం విలువ గురువారం గణనీయంగా బలపడింది. డాలర్‌తో పోలిస్తే.. ఆల్‌టైం కనిష్ట ముగింపు స్థాయిల నుంచి కోలుకుని 42 పైసలు పెరుగుదలతో 60.88 వద్ద ముగిసింది. దేశీ స్టాక్ మార్కెట్లు మెరుగ్గా ఉండటం, అటు విదేశాల్లో డాలరు బలహీనపడటం, దీంతో పాటు ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం సైతం రూపాయి బలపడటానికి దోహదపడ్డాయి.
ఈ వారాంతంలోగా రూపాయికి మద్దతుగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముందంటూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అరవింద్ మయారాం సూచనప్రాయంగా తెలపడం రూపాయికి కాస్త ఊతమిచ్చింది. దేశీ కరెన్సీ మంగళవారం ఇంట్రాడేలో ఆల్‌టైం కనిష్టమైన 61.80 స్థాయికి పతనమైన సంగతి తెలిసిందే.
ప్రతి సోమవారం రూ.22 వేల కోట్ల బాండ్ల అమ్మకం
ఇదిలా ఉండగా, రూపాయి క్షీణతకి అడ్డుకట్ట వేసేందుకు ఆర్‌బీఐ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఫారెక్స్ మార్కెట్లో హెచ్చుతగ్గులను కట్టడి చేసే దిశగా ప్రతి సోమవారం రూ. 22,000 కోట్ల మేర ప్రభుత్వ బాండ్లను విక్రయించాలని నిర్ణయించింది. వేలం వ్యవధి ఎంత ఉంటుందన్నది.. వేలం తేదికి ఒక రోజు ముందుగా ప్రకటించడం జరుగుతుందని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ద్రవ్య లభ్యతను సమర్ధంగా నిర్వహించేందుకు ఈ క్యాష్ మేనేజ్‌మెంట్ బిల్స్ దోహదపడగలవని పేర్కొంది. డాలర్‌తో పోలిస్తే అంతకంతకూ క్షీణిస్తున్న రూపాయి మారకం విలువ మంగళవారం ఇంట్రాడేలో ఆల్‌టైం కనిష్టమైన 61.80ని తాకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రూపాయి పతనాన్ని నిలువరించే దిశగా.. ద్రవ్య సరఫరాను క ఠినతరం చేయడానికి, స్పెక్యులేషన్ కి అడ్డుకట్ట వేయడానికి ఆర్‌బీఐ పలు చర్యలు తీసుకుంది.