ట్విట్టర్ అంటే ఆయనకు ఎందుకిష్టం?
ఆయనో ప్రపంచ ప్రఖ్యాత మీడియా బ్యారన్. వందలాది వార్తా పత్రికలు, మేగజైన్లు, టీవీ ఛానెళ్లకు అధిపతి. మూడు ఖండాల్లో పలుకుబడి గల వ్యక్తి. ప్రపంచంలో నాలుగో అతి పెద్ద మీడియా గ్రూపైన ‘న్యూస్ కార్ప్ లేదా న్యూస్ కార్పొరేషన్’, ‘21 సెంచరీ ఫాక్స్’కు సీఈవో. ‘ది టైమ్స్, ది సన్’ లాంటి పత్రికలు ఆయన గ్రూపు నుంచే వెలువడుతున్నాయి. ఆయనే రూపర్ట్ మర్డోక్. ఆయన తలచుకుంటే ఆయన తన అభిప్రాయాలను తన పత్రికలన్నింటిలోనూ ప్రచురించుకోవచ్చు, టీవీ ఛానెళ్లలో ప్రసారం చేసుకోవచ్చు. కానీ ఇటీవలి కాలంలో తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ‘ట్విట్టర్’ను ఉపయోగిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలనో, తన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అంశాలనో షేర్ చేసుకోవడానికి ట్విట్టర్‌ను ఉపయోగించడం లేదు. కేవలం సమకాలీన రాజకీయాలు, సామాజిక అంశాలను షేర్ చేసుకోవడానికే ఉపయోగిస్తున్నారు.
అతి పెద్ద మీడియా గ్రూప్‌నకు అధిపతిగా ఉంటూ ట్విట్టర్‌ను ఎందుకు ఉపయోగిస్తున్నారు? అన్నది ఆసక్తికరమైన ప్రశ్నే. ఆయన ఇటీవల చైనాతో అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోవాల్సిన అవసరం గురించి, ఆస్ట్రేలియా సెనేట్ ప్రతిష్టంభన గురించి, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి టోనీ అబాట్‌ను సమర్థించాల్సిన అవసరం గురించి, గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్న డ్రగ్స్ కల్చర్ గురించి ట్వీట్లు చేశారు. ఇవన్నీ కూడా ఆయన పత్రికలు ఇప్పటికే రాశాయి, రాస్తున్నాయి. మరి, ట్విట్టర్‌లో వ్యక్తం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ట్విట్టర్‌లో పాఠకులు ఎక్కువ మంది ఉంటారనా ? ఆయనకున్న మీడియా పాఠకుల్లో వందోవంతు కూడా ట్విట్టర్ పాఠకులు ఉండరు.
ఒకప్పుడు సెల్‌ఫోన్ కూడా సరిగ్గా వాడడం రాని, ఎస్సెమ్మెస్‌లు ఇవ్వడం కూడా చేతకాని మర్డోక్ ఇప్పుడు సోషల్ వెబ్‌సైట్లను స్వయంగా వాడడం నేర్చుకున్నారు. ఇప్పటికీ ఆయన వెబ్‌సైట్లలో టెలిగ్రాఫిక్ భాషనే వాడతారు. అది వేరే విషయం. డిజిటల్ పబ్లిషింగ్ కన్నా తాను ముందుండాలన్నది ఆయన తాపత్రయమని, అందుకే ఆయన ట్విట్టర్ ఉపయోగిస్తున్నారని, ఆయన జీవిత చరిత్ర రచయిత వూల్ఫ్ ఓ సందర్భంలో తెలియజేశారు. మర్డోక్‌కు ఇప్పుడు ట్విట్టర్‌లో 6,12,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం ఆయన మీడియా గ్రూప్ ఆస్తి రెండు లక్షల కోట్ల రూపాయలు. మీడియాపై రెవెన్యూ 30 లక్షల కోట్ల రూపాయలు, నికర లాభం ఆరు వేల కోట్ల రూపాయలు.