Rupert Murdoch
-
ఐదోసారీ పెళ్లికి సిద్ధమైన మర్డోక్
కాలిఫోర్నియా: మీడియా రంగ దిగ్గజం రూపర్ట్ మర్డోక్‌కు 92 ఏళ్ల వయస్సులో మళ్లీ పెళ్లి కుదిరింది. రష్యాకు చెందిన మాజీ మాలిక్యులర్ బయాలజిస్ట్ ఎలెనా ఝకోవా(67)ను త్వరలో ఆయన పెళ్లి చేసుకోనున్నారు. జూన్‌లో వీరిద్దరు ఒక్కటవుతారని, ఇప్పటికే ఆహ్వాన పత్రాలు కూడా పంపారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఆస్ట్రేలియాలో జన్మించిన మర్డోక్‌కు గతేడాది అన్ లెస్లీతో ఎంగేజ్మెంట్ అయింది. అనంతరం ఇద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి మర్డోక్ ఎలెనాతో డేటింగ్ చేస్తున్నారు. మర్డోక్‌కు ఇది ఆరో ఎంగేజ్మెంట్ కాగా, అయిదో పెళ్లి. -
పదవి నుంచి తప్పుకొన్న మీడియా మొఘల్ ముర్డోచ్.. ఏడు దశాబ్దాల తర్వాత..
మీడియా మొఘల్‌గా పేరొందిన రూపర్ట్ ముర్డోచ్ (Rupert Murdoch) ఏడు దశాబ్దాల తర్వాత పదవి నుంచి దిగిపోయారు. ఫాక్స్, న్యూస్ కార్ప్ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన కుమారుడు లాచ్లాన్ ముర్డోచ్ రెండు కంపెనీలకు తదుపరి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు అమెరికన్ న్యూస్ ఏజెన్సీ ‘ఏపీ’ నివేదించింది. 92 ఏళ్ల రూపర్ట్ ముర్డోచ్ రెండు కంపెనీలకు ఎమిరిటస్ చైర్మన్ అవుతారని, లాచ్లాన్ న్యూస్ కార్ప్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని, ఫాక్స్ కార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గానూ కొనసాగుతారని ‘ఫాక్స్’ సంస్థ పేర్కొంది. రూపర్ట్ ముర్డోచ్ ఎమెరిటస్ ఛైర్మన్‌గా కొనసాగనుండటం సంతోషంగా ఉందని, ఆయన విలువైన సలహాలు రెండు కంపెనీలకు కొనసాగుతాయని లాచ్లాన్ ముర్డోచ్ పేర్కొన్నారు. తనలాగే కంపెనీలు కూడా దృఢమైన ఆరోగ్యంతో ఉన్నాయని ‘ఫాక్స్’ ఉద్యోగులను ఉద్దేశిస్తూ రూపెర్ట్ మర్డోచ్ పేర్కొన్నట్లు తమకు లభించిన లేఖను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. ఫాక్స్, న్యూస్ కార్ప్‌లను విలీనం చేయడం ద్వారా తన మీడియా సామ్రాజ్యాన్ని మళ్లీ ఏకం చేసే ప్రణాళికను విరమించుకున్న కొన్ని నెలల్లోనే ముర్డోచ్ పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం. ఫాక్స్ న్యూస్‌తో పాటు ABC, CBS, NBC వార్తా సంస్థలకు పోటీగా మొదటి ప్రసార నెట్‌వర్క్‌ను ముర్డోచ్ ప్రారంభించారు. అంతేకాదు రూపర్ట్ ముర్డోచ్.. వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ పోస్ట్ వార్తా సంస్థలకు కూడా యజమానే. -
92 ఏళ్ల వయసులో నాలుగో భార్యకు విడాకులిచ్చిన కోటీశ్వరుడు
వాషింగ్టన్: అమెరికా బిలియనీర్, మీడియా మొగల్‌గా ప్రఖ్యాతి గాంచిన రుపర్ట్ ముర్డోచ్ 92 ఏళ్ల వయసులో తన నాలుగో భార్య జెర్రీ హాల్(65)కు విడాకులు ఇచ్చారు. కేవలం 11 పదాల సందేశాన్ని ఈమెయిల్ చేసి ఆమెకు కటీఫ్ చెప్పారు. ఈ సమయంలో ఆమె ఇంట్లోనే ముర్డోచ్ కోసం ఎదురు చూస్తుండటం గమనార్హం. 'మనమిద్దరం కచ్చితంగా మంచి సయమం గడిపాం. కానీ నేను ఇంకా చాలా చేయాల్సి ఉంది. నా న్యూయార్క్ లాయర్ తక్షణమే వచ్చి నిన్ను కలుస్తారు' అని జెర్రీకి ముర్డోచ్ విడాకుల సందేశం పంపారు. ఈ జంట దాదాపు 6 ఏళ్లు కలిసి ఉంది. ఇది ముర్డోచ్‌కు నాలుగో వివాహం కాగా.. జెర్రీకి మాత్రం మొదటిది. అయితే ఆమె అంతకుముందు రాక్‌స్టార్ మిగ్ జాగర్‌తో కొంతకాలం పాటు రిలేషన్లో ఉన్నారు. గతేడాది జూన్‌లో వీరి విడాకులు ఎలా జరిగాయనే విషయాన్ని జెర్రీ స్నేహితులు తాజాగా వెల్లడించారు. ముర్డోచ్ సందేశం చూసి జెర్రీ హాల్ మైండ్ బ్లాంక్ అయిందని వాపోయారు. ఆమెకు ఏం చేయాలో తెలియలేదని పేర్కొన్నారు. అంతేకాదు విడాకుల విషయం చెప్పిన అనంతరం కాలిఫోర్నియాలోని తన మ్యాన్షన్ హౌస్ విడిచి పెళ్లిపోవాలని జేర్రీకి ముర్డోచ్ 30 రోజులే గడువు ఇచ్చాడని తెలిపారు. ముర్డోచ్ 14.5 బిలియన్ డాలర్లకు అధిపతి. ఆయనకు మొత్తం ఆరుగురు సంతానం. వీరిలో ఒక్కరు కూడా జెర్రీ సంతానం కాదు. దీంతో అతని ఆస్తిలో ఆమెకు వాటా వచ్చే అవకాశం లేదు. 2016లో సెంట్రల్ లండన్‌లో ముర్డోచ్, జెర్రీల వివాహం ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ.. ఈ ప్రపంచంలో తాను అత్యంత అదృష్టవంతుడినని, సంతోషమైన వ్యక్తిని అని ముర్డోచ్ రాసుకొచ్చారు. ఇక ట్విట్టర్లో ఎలాంటి పోస్టులు పెట్టొబోనని కూడా ఈ సందర్భంగాప్రకటించారు. మరో పెళ్లి అని ప్రకటించి.. అయితే జేర్రీకి విడాకులిచ్చి ఏడాది కూడా గడవక ముందే తాను ఐదో పెళ్లి చేసుకోబోతున్నట్లు గత నెలలోనే ప్రకటించారు ముర్డోచ్. అన లెస్లే స్మిత్‌ను మనువాడుతానని చెప్పాడు. ఈమె ఏడు నెలలక్రితమే పరిచయమైనట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వీరు పెళ్లి ఆలోచన విరమించుకున్నట్లు సమాచారం. దీంతో ఐదో పెళ్లి అనుకోకుండా రద్దయింది. ది సన్, ది టైమ్స్ వంటి న్యూస్‌పేపర్లు, ఫాక్స్ న్యూస్, ది వాల్ స్ట్రీట్ జర్నల్ వంటి మీడియా సంస్థలకు ముర్డోచ్ యజమాని. ఆస్ట్రేలియాలో జన్మించిన ఈయన అమెరికాలో స్థిరపడ్డారు. మీడియా మొగల్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందారు. చదవండి: ఇదేందిరా అయ్యా.. పెళ్లి వేడుకలో వధువుకు చేదు అనుభవం -
పాపం ముర్డోచ్ ఐదో పెళ్లి ఆగిపోయింది..
92 ఏళ్ల రూపెర్ట్ ముర్డోచ్, 66 ఏళ్ల ఆన్ లెస్లీ స్మిత్‌ల ప్రేమ కథ ముగిసిపోయింది. మతాల కారణంగా వారి నిశ్చితార్థం ఆగిపోయింది. ఇటీవలే ప్రేమలో పడిన ఆ వృద్ధ ప్రేమికుల పెళ్లికి అడ్డంకులు తప్పలేదు. వచ్చే వేసవి పెళ్లి చేసుకోవాలని భావించిన ఆ జంట నిశ్చితార్థం కూడా కాకుండానే విడిపోయింది. రూపెర్ట్ ముర్డోచ్ ప్రముఖ మీడియా సంస్థల అధినేత. ఫాక్స్ న్యూస్, న్యూస్ కార్ప్, స్కై న్యూస్ వంటి వార్తా సంస్థలను ఆయన స్థాపించారు. ఇక ఆన్ లెస్లీ స్మిత్ రేడియో హోస్ట్, మాజీ దంత వైద్యురాలు. వానిటీ ఫెయిర్ పత్రిక కథనం ప్రకారం.. స్మిత్ అవలంభిస్తున్న మతాచారాలతో ముర్డోచ్‌కు పొసగడం లేదు. దీంతో ఆమెతో ప్రేమకు స్వస్తి చెప్పి నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. వీరి ప్రేమాయణం 2022 సెప్టెంబర్ లో ప్రారంభమైంది. తన నాల్గవ భార్య జెర్రీ హాల్ నుంచి విడాకులు తీసుకున్న వెంటనే ముర్డోచ్ 2023 మార్చిలో స్మిత్‌తో తన నిశ్చితార్థాన్ని ప్రకటించాడు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రేమలో పడటానికి భయపడ్డాను కానీ ఇది తన చివరి ప్రేమ అని ముర్డోచ్ తన యాజమాన్యంలోని న్యూయార్క్ పోస్ట్‌తో అప్పట్లో చెప్పారు. సెయింట్ పాట్రిక్స్ డే రోజున తాను స్మిత్‌కు ప్రపోజ్ చేశానని, ఆ సందర్భం తనను ఆందోళనకు గురి చేసిందని కూడా పేర్కొన్నారు. ఈ జంట జనవరిలో బార్బడోస్‌లో హాలిడేలో కనిపించారు. స్మిత్ సముద్రం నుంచి షర్ట్‌లెస్ ముర్డోచ్కి సహాయం చేస్తున్నట్లు ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఫిబ్రవరిలో ముర్డోచ్ సెంట్రల్ పార్క్ సౌత్‌లో 30 మిలియన్ డాలర్లు, 6,500 చదరపు అడుగుల భారీ నివాసాన్ని కొనుగోలు చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. -
నాలుగో భార్యకూ మర్డోక్ విడాకులు
లండన్: మీడియా దిగ్గజం, బిలియనీర్ రూపర్ట్ మర్డోక్(91) నాలుగో భార్య జెర్రీ హాల్(60) నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధపడ్డారు. అమెరికాకు చెందిన ప్రముఖ మోడల్, నటి జెర్రీ హాల్‌ను మర్డోక్ లండన్‌లో 2016లో వివాహమాడారు. మర్డోక్ కుటుంబ సన్నిహితుల సమాచారం మేరకు ఈ దంపతులు విడిపోతున్నట్లు తెలిసిందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మీడియా సామ్రాజ్యాన్ని విస్తరించిన మర్డోక్ ఆస్తులు ఫోర్బ్స్ అంచనా ప్రకారం సుమారు 1.38 లక్షల కోట్లు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని ప్రముఖ వార్తా సంస్థలను మర్డోక్ నిర్వహిస్తున్నారు. న్యూస్ కార్ప్, ఫాక్స్ కార్ప్‌ల్లో మర్డోక్‌కు వాటా 40% వాటా ఉంది. మర్డోక్ తన మొదటి భార్య, ఫ్లైట్ అటెండెంట్ అయిన పాట్రిసియా 1966లో విడిపోయారు. రెండో భార్య అన్నా నుంచి 1999లో, మూడో భార్య వెండీ డెంగ్‌తో 2014లో విడిపోయారు. -
నాలుగో భార్యకు మీడియా మొఘల్ విడాకులు
పెళ్లిని నూరేళ్ల పంటగా అభివర్ణించారు పెద్దలు. కానీ ఈ కాలంలో మాత్రం ఈ మూడు ముళ్ల బంధం మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. కొన్ని నెలలు లేదా సంవత్సరాలకే నువ్వు నాకొద్దు బాబోయ్ అంటూ దంపతులు విడాకులు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో పెళ్లి, విడాకులు సర్వసాధారణమయ్యాయి. తాజాగా మీడియా మొఘల్ రూపర్ట్ ముదోర్చ్, మోడల్, నటి జెర్రీ హాల్ వివాహ బంధానికి స్వస్తి చెప్పినట్లు తెలుస్తోంది. ఇక కలిసి ఉండలేమంటూ విడాకులు తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ఫాక్స్ కంపెనీ చైర్మన్, సీఈవో అయిన రూపర్ట్‌కు ఇదివరకే మూడు విడాకులు కాగా ఇది నాలుగవది. 1956లో అతడు పార్టీసియా బుకర్‌ను పెళ్లి చేసుకున్నాడు. 1967లో ఆమెకు విడాకులిచ్చేసి అదే ఏడాది అన్నా మరియాను వివాహమాడాడు. 32 ఏళ్ల పాటు ఆమెతో కలిసున్న అతడు 1999లో వెండి డెంగ్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 2013లో ఆమెకు కూడా విడాకులిచ్చేశాడు. అనంతరం 2016లో మోడల్, నటి జెర్రీని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం 91 ఏళ్ల వయసున్న రూపర్ట్ ఇప్పుడు ఆమెకు కూడా విడాకులిస్తుండటం గమనార్హం. ఇక జెర్రీ హాల్ విషయానికి వస్తే ఆమె బ్యాట్మన్, ద గ్రాడ్యుయేట్ వంటి చిత్రాల్లో నటించింది. గతంలో సింగర్ మిక్ జాగర్ను పెళ్లాడిన ఆమె తర్వాత అతడితో విడిపోయింది. ఈ పెళ్లిళ్ల ద్వారా రూపర్ట్, జెర్రీలకు మొత్తం 10 మంది పిల్లలున్నారు. చదవండి: అప్పుడు కాలర్ ఎగిరేశా.. కానీ అంత ఈజీ కాదు యంగ్ హీరో సినిమాపై తలైవా పొగడ్తల వర్షం -
మీడియా టైకూన్ మాజీ భార్యతో పుతిన్ డేటింగ్!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మళ్లీ ప్రేమదోమ కుట్టినట్టు కనిపిస్తోంది. తాజాగా షికార్లు చేస్తున్న రుమర్ల ప్రకారం ఆయన మీడియా మొఘల్ రూపర్ట్ మర్డోర్ మాజీ భార్య వెండి డెంగ్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. 2013లో భార్య ష్క్రెబ్నెవాకు విడాకులు ఇచ్చింది మొదలు రష్యా నేత పుతిన్ చుట్టూ నిత్యం వదంతులు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఆయన ఇప్పటికే రిథమిక్ జిమ్నాస్ట్ ఎలీనా కబేవాతో, టాప్ మహిళా బాక్సర్ నటాలియా రగొజినాతో ప్రేమాయణం సాగించినట్టు వార్తలు వచ్చాయి. రూపర్ట్ మర్డోక్ మూడో భార్య అయిన వెండీ డెంగ్ 2013లో భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత ఆమె కొంతకాలం బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో ప్రేమాయణం సాగించినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మాత్రం ఆమె పుతిన్‌తో గాఢమైన ప్రేమలో మునిగిపోయిందట. ఈ ఇద్దరూ సీరియస్‌గా రిలేషన్షిప్ మెయింటేన్ చేయాలని నిర్ణయించుకున్నట్టు యూఎస్ వీక్లీ తెలిపింది. 'డెంగ్ ఇంతవరకు పుతిన్‌తో కలిసి మీడియా కంటికి కనిపించలేదు. కానీ ఇప్పటికే పుతిన్ సన్నిహిత మిత్రుడైన రోమన్ అబ్రామొవిచ్తో కలిసి ఆమె విమానంలో ప్రయాణించింది' అని ఆ పత్రిక వెల్లడించింది. గతంలోనూ డెంగ్, పుతిన్ డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా వస్తున్న కథనాలు నిజమైతే త్వరలోనే రష్యా అధ్యక్షుడు మరో లగ్గానికి సిద్ధమైనట్టేనని చెప్తున్నారు. -
84 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లి
లండన్: ఐదు నెలల ప్రణయ సల్లాపాలకు శుభం కార్డు వేస్తూ.. 84 ఏళ్ల రూపర్ట్ మర్డోక్ మళ్లీ పెళ్లి కొడుకు అయ్యాడు. మాజీ సూపర్ మోడలైన తన ప్రేయసి జెర్రీ హాల్ (59)ను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. లండన్‌లోని ప్రిన్స్ డయానా పూర్వీకుల రాజభవనమైన స్పెన్సర్ హౌజ్‌లో వీరి పెళ్లి వేడుక నిరాడంబరంగా జరిగింది. మీడియా మొఘల్, న్యూస్ క్రాప్ చైర్మన్ అయిన మర్డోక్ ఐదు నెలల కిందట ఆస్ట్రేలియాలో జెర్రీ హాల్‌ను కలిశాడు. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడిన ఈ ముదిమి ప్రేమికుడు ఐదునెలలుగా జెర్రీతో డేటింగ్ చేస్తున్నాడు. గత అక్టోబర్‌లో లండన్‌లో రగ్బీ యూనియన్ వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా ఈ ఇద్దరు కలిసి ఫొటోలకు పోజు ఇవ్వడంతో వీరి మధ్య ఏదో ఉందని ఊహాగానాలు వినిపించాయి. ఈ ఊహాగానాలకు తెరదించుతూ తమ బంధాన్ని పెళ్లి వైపు నడిపిస్తూ గత జనవరిలో లాస్ ఏంజిల్స్‌లో ఈ ఇద్దరు నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ సందర్భంగా కుబేరుడైన మర్డోక్ జెర్రీ చేతివేలికి అక్షరాల 4.2 మిలియన్ పౌండ్ల ఉంగరం తొడిగారు. ఈ ఇద్దరి వివాహం కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్య సాదాసీదాగా జరిగినప్పటికీ, శనివారం లండన్‌లోని చారిత్రక సెయింట్ బ్రైడ్స్ చర్చిలో వివాహ విందు ఘనంగా జరుగనుంది. తమ పెళ్లి అనంతరం మర్డోక్ స్సందిస్తూ తాను ప్రపంచంలోనే అదృష్టవంతుడిని, ఆనందమైన వ్యక్తిని అని ట్వీట్ చేశాడు. 'రానున్న పదిరోజులు లాదా మరెప్పుడు ట్వీట్స్ చేయను. ప్రపంచంలోనే అదృష్టవంతుడిని, ఆనందమైన వ్యక్తిని అనే భావన కలుగుతోంది' అని ఆయన పేర్కొన్నాడు. -
ఆయనకు 84.. ఆమెకు 59.. మళ్లీ పెళ్లి!
అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, చైనా దేశాల్లో వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన 'న్యూస్ కార్పొరేషన్' ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రూపర్ట్ ముర్దోక్ తన 84వ ఏట మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. ముగ్గురు భార్యలతో ఇప్పటికే ఆరుగురు పిల్లలున్న ముర్దోక్.. ఇప్పుడు నాలుగో పెళ్లిగా నలుగురు పిల్లలున్న 59 ఏళ్ల జెర్రీ హాల్‌ను పెళ్లి చేసుకోబోతున్నారు. వందల కోట్ల రూపాయల భరణాన్ని చెల్లించి తన ముగ్గురు భార్యలకు ముర్దోక్ విడుకులివ్వగా, 'రోలింగ్ స్టోన్' రాక్ ట్రూప్‌లో ఫ్రంట్ మేన్ మిక్ జాగర్ 1990లో పెళ్లి చేసుకొని 1999లో ఆయనకు విడాకులు ఇచ్చిన జెర్రీ హాల్.. 16 ఏళ్ల తర్వాత రెండో పెళ్లి చేసుకుంటున్నారు. గత అక్టోబర్ నెల నుంచి డేటింగ్ చేస్తున్న ముర్దోక్, జెర్రీహాల్ ఇద్దరూ బెవర్లీ హిల్టన్‌లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రెడ్ కార్పెట్‌పై చేతులో చెయ్యేసి నడవడంతో హాలీవుడ్ సెలబ్రెటీలలో గుసగుసలు ప్రారంభమయ్యాయి. వాటిని నిజంచేస్తూ తాము త్వరలో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నామంటూ 'ది టైమ్స్' పత్రికలో ఓ వాణిజ్య ప్రకటన ఇచ్చారు. 'ప్రుడెన్స్, ఇలిసాబెత్, లచ్లాన్, జేమ్స్, గ్రేస్, క్లో ముర్దోక్లకు తండ్రైనా రూపర్ట్ ముర్దోక్, ఎలిజబెత్, జేమ్స్, జార్జియా, గాబ్రియెల్ జాగర్లకు తల్లైనా జెర్రీ హాల్ ఎంగేజ్మెంట్ నిశ్చయమైందని చెప్పడానికి సంతోషిస్తున్నాం' అని ఆ క్లాసిఫైడ్ యాడ్‌లో ప్రకటించారు. 'ది టైమ్స్' పత్రికను 'న్యూస్ కార్పొరేషన్' సంస్థ వెలువరిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా నుంచి పలు పత్రికలను ప్రచురిస్తున్న ఈ సంస్థ వందకుపైగా టీవీ ఛానళ్లను కూడా నడుపుతోంది. సంపాదనపరంగా న్యూస్ కార్పొరేషన్ నాలుగో అతిపెద్ద మీడియా సంస్థ. హాలీవుడ్లో అతి పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన 'ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్' సంస్థ కూడా ఈ మీడియా సంస్థలో భాగమే. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కోవడం వల్ల ఇదే సంస్థ నుంచి వెలువడుతున్న 'న్యూస్ ఆఫ్ ది వరల్డ్' అనే పత్రికను మూసివేయాల్సి వచ్చింది. అక్టోబర్‌లో డేటింగ్ మొదలుపెట్టిన ముర్దోక్, జెర్రీ హాల్ అదే నెలలో జరిగిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా రగ్బీ వరల్డ్ కప్ ఫైనల్లో పబ్లిక్‌గా మొదటిసారి కనిపించారు. రెండోసారి గోల్డెన్ గ్లోబ్ పోటీల్లోనే కనిపించారు. వారిద్దరు పీకలోతు ప్రేమలో మునిగిపోయారని, వారు పెళ్లి చేసుకోవడం పట్ల తమకు ఏ మాత్రం అభ్యంతరం లేదని ముర్దోక్ పిల్లలు, జెర్రీ హాల్ పిల్లలు మీడియా ముందు వ్యాఖ్యానించారు. తాము కూడా ఇక జీవితంలో స్థిరపడాలని కోరుకుంటున్నట్లు కొత్త జంట ప్రకటించింది. జీవితంలో స్థిరపడటం అంటే వారి ఉద్దేశం ఏంటో! ఇద్దరు వేర్వేరుగా పలువురితో ఇంతకాలం జరిపిన ప్రణయ పురాణాలకు స్వస్తి చెప్పడమేమో!! -
ఆయనే బెస్ట్ లీడర్: మర్డోక్
వాషింగ్టన్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మీడియా మొఘల్ రూపర్ట్ మర్డోక్ ప్రశంసలు కురిపించారు. మోదీ ఉత్తమ నాయకుడు అని కితాబిచ్చారు. మంచి విధానాలు అవలంభిస్తున్నారని మెచ్చుకున్నారు. 'భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవడం చాలా ఆనందంగా ఉంది. భారత్ కు స్వాతంత్ర్యం తర్వాత వచ్చిన నాయకుల్లో మోదీ బెస్ట్. మంచి విధానాలతో ఆయన బెస్ట్ లీడర్ అనిపించుకుంటున్నారు' అని రూపర్ట్ మర్డోక్ ట్వీట్ చేశారు. అమెరికా పర్యటనలో నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పై కూడా ఆయన ప్రశంసలు కురిపించారు. అవినీతి అంతం చేయడానికి జిన్‌పింగ్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. Great hour with Indian PM Modi. Best leader with best policies since independence, but massive task to achieve in most complex nation. — Rupert Murdoch (@rupertmurdoch) September 25, 2015 -
ట్విట్టర్ అంటే ఆయనకు ఎందుకిష్టం?
ఆయనో ప్రపంచ ప్రఖ్యాత మీడియా బ్యారన్. వందలాది వార్తా పత్రికలు, మేగజైన్లు, టీవీ ఛానెళ్లకు అధిపతి. మూడు ఖండాల్లో పలుకుబడి గల వ్యక్తి. ప్రపంచంలో నాలుగో అతి పెద్ద మీడియా గ్రూపైన ‘న్యూస్ కార్ప్ లేదా న్యూస్ కార్పొరేషన్’, ‘21 సెంచరీ ఫాక్స్’కు సీఈవో. ‘ది టైమ్స్, ది సన్’ లాంటి పత్రికలు ఆయన గ్రూపు నుంచే వెలువడుతున్నాయి. ఆయనే రూపర్ట్ మర్డోక్. ఆయన తలచుకుంటే ఆయన తన అభిప్రాయాలను తన పత్రికలన్నింటిలోనూ ప్రచురించుకోవచ్చు, టీవీ ఛానెళ్లలో ప్రసారం చేసుకోవచ్చు. కానీ ఇటీవలి కాలంలో తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ‘ట్విట్టర్’ను ఉపయోగిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలనో, తన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అంశాలనో షేర్ చేసుకోవడానికి ట్విట్టర్‌ను ఉపయోగించడం లేదు. కేవలం సమకాలీన రాజకీయాలు, సామాజిక అంశాలను షేర్ చేసుకోవడానికే ఉపయోగిస్తున్నారు. అతి పెద్ద మీడియా గ్రూప్‌నకు అధిపతిగా ఉంటూ ట్విట్టర్‌ను ఎందుకు ఉపయోగిస్తున్నారు? అన్నది ఆసక్తికరమైన ప్రశ్నే. ఆయన ఇటీవల చైనాతో అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోవాల్సిన అవసరం గురించి, ఆస్ట్రేలియా సెనేట్ ప్రతిష్టంభన గురించి, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి టోనీ అబాట్‌ను సమర్థించాల్సిన అవసరం గురించి, గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్న డ్రగ్స్ కల్చర్ గురించి ట్వీట్లు చేశారు. ఇవన్నీ కూడా ఆయన పత్రికలు ఇప్పటికే రాశాయి, రాస్తున్నాయి. మరి, ట్విట్టర్లో వ్యక్తం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ట్విట్టర్లో పాఠకులు ఎక్కువ మంది ఉంటారనా ? ఆయనకున్న మీడియా పాఠకుల్లో వందోవంతు కూడా ట్విట్టర్ పాఠకులు ఉండరు. ఒకప్పుడు సెల్‌ఫోన్ కూడా సరిగ్గా వాడడం రాని, ఎస్సెమ్మెస్‌లు ఇవ్వడం కూడా చేతకాని మర్డోక్ ఇప్పుడు సోషల్ వెబ్సైట్లను స్వయంగా వాడడం నేర్చుకున్నారు. ఇప్పటికీ ఆయన వెబ్సైట్లలో టెలిగ్రాఫిక్ భాషనే వాడతారు. అది వేరే విషయం. డిజిటల్ పబ్లిషింగ్ కన్నా తాను ముందుండాలన్నది ఆయన తాపత్రయమని, అందుకే ఆయన ట్విట్టర్ ఉపయోగిస్తున్నారని, ఆయన జీవిత చరిత్ర రచయిత వూల్ఫ్ ఓ సందర్భంలో తెలియజేశారు. మర్డోక్‌కు ఇప్పుడు ట్విట్టర్లో 6,12,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం ఆయన మీడియా గ్రూప్ ఆస్తి రెండు లక్షల కోట్ల రూపాయలు. మీడియాపై రెవెన్యూ 30 లక్షల కోట్ల రూపాయలు, నికర లాభం ఆరు వేల కోట్ల రూపాయలు. -
ట్వెంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్ సీఈవోగా జేమ్స్ మర్డోక్?
న్యూయార్క్: మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ తాజాగా ట్వెంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్ సంస్థ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుని, కుమారుడు జేమ్స్‌కి (42) పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఈ ఏడాది గానీ లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ జరగొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ గ్రూప్‌నకు మర్డోక్ (84) ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గాను, ఆయన మరో కుమారుడు లష్లాన్ (43) కో-చైర్మన్‌గానూ కొనసాగుతారని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ఫాక్స్ హాలీవుడ్ స్టూడియోస్, ఇతర టెలివిజన్ విభాగాలు ట్వెంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్‌లో భాగంగా ఉన్నాయి. వివాదంలో చిక్కుకున్న న్యూస్ కార్ప్ మహా సామ్రాజ్యం నుంచి రెండేళ్ల క్రితం ఈ కార్యకలాపాలను విడగొట్టి ఈ కొత్త సంస్థను ఏర్పాటు చేశారు రూపర్ట్ మర్డోక్. -
టైమ్ వార్నర్‌పై మర్డోక్ కన్ను..
బోస్టన్: మీడియా దిగ్గజం, ట్వెంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్ అధినేత రూపర్ట్ మర్డోక్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించడంపై దృష్టి సారించారు. తాజాగా మరో మీడియా దిగ్గజం టైమ్ వార్నర్‌ను దక్కించుకునేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 80 బిలియన్ డాలర్ల(సుమారు రూ.4.8 లక్షల కోట్లు) ఆఫర్ ఇచ్చారు. అయితే, టైమ్ వార్నర్ దీన్ని తిరస్కరించడంతో మరో కొత్త వ్యూహాన్ని రచించడంలో మర్డోక్ నిమగ్నమయ్యారు. గతంలో ఆయన టైమ్ వార్నర్ షేరుకి 85 డాలర్ల చొప్పున లెక్కగడతామని ఆఫర్ చేశారు. డీల్ మొత్తంలో 60 శాతం భాగానికి ట్వెంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్ షేర్లను, మిగతా 40 శాతం భాగానికి నగదు రూపంలో చెల్లిస్తామన్నారు. కానీ, ఇందుకు టైమ్ వార్నర్ ఒప్పుకోకపోవడంతో షేరుకి 95 డాలర్ల మేర మర్డోక్ చెల్లించాల్సి రావొచ్చని.. అలాగే డీల్‌లో నగదు పరిమాణాన్ని కూడా మరింతగా పెంచాల్సి రావొచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. టైమ్ వార్నర్ ఆదాయ సామర్థ్యాలను బట్టి చూస్తే డీల్ విలువ కనీసం 94 బిలియన్ డాలర్ల పైచిలుకు ఉండాలంటున్నాయి. అదనంగా మరింత వెచ్చించాల్సి వస్తున్నా.. మర్డోక్ మాత్రం ఈ డీల్‌పై పట్టుదలగా ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో టైమ్ వార్నర్ షేరు మాత్రం దూసుకెడుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే ఏకంగా 20 శాతం ఎగిసి 86 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. తెర వెనుక కథ ఇదీ... టైమ్ వార్నర్ గ్రూప్‌ను కొంటున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ మర్డోక్ దృష్టంతా ప్రధానంగా ఆ గ్రూప్‌లోని హెచ్బీవోపైనే ఉంది. టీవీ నెట్‌వర్క్‌లకు ప్రస్తుతం మరింత ఆదాయం తెచ్చిపెడుతున్న ఆన్లైన్ వీడియో సర్వీసుల విభాగంలో.. ఈ చానల్ హెచ్‌బీవో గో పేరిట సేవలు అందిస్తోంది. సినిమాలే కాకుండా.. అత్యంత ఆదరణ పొందిన గేమ్ ఆఫ్ థ్రోన్స్, గ ర్ల్స్ వంటి టీవీ షోలు హెచ్‌బీవో చేతిలో ఉండటం కూడా మర్డోక్ దృష్టిని ఆకర్షించింది. గతేడాది హెచ్‌బీవో 4.9 బిలియన్ డాలర్ల ఆదాయంపై 1.9 బిలియన్ డాలర్ల మేర స్థూల లాభాన్ని ఆర్జించింది. దీనికి పోటీగా దూసుకొస్తున్న నెట్‌ఫ్లిక్స్ ఆదాయం 4.4 బిలియన్ డాలర్ల మేర ఉండగా లాభం 277 మిలియన్ డాలర్లే. ప్రస్తుతం ఆన్లైన్ వీడియో సర్వీసుల వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్న ఫాక్స్ పెద్ద ఎత్తున కంటెంట్ సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే లాభసాటి హెచ్బీవోను కొనుగోలు చేయాలనుకుంటోంది. దీనికోసం ఒక్క హెచ్‌బీవో విలువను 20 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టింది. అయితే, హెచ్‌బీవో ఒక్కదాన్నే కొనేసే పరిస్థితి లేకపోవడంతో.. దానితో పాటు పనిలో పనిగా టైమ్ వార్నర్ గ్రూప్‌ను మొత్తం కొనేసి అత్యంత భారీ మీడియా దిగ్గజంగా నిలవాలని మర్డోక్ నేతృత్వంలోని ట్వెంటీఫస్డ్ సెంచరీ ఫాక్స్ భావిస్తోంది. ఇందుకోసమే టైమ్ వార్నర్ వాటాదారులు నిరాకరించలేని ఆఫర్ ఇవ్వాలని యోచిస్తోంది. టైమ్ వార్నర్: 2013 గణాంకాల ప్రకారం మార్కెట్ క్యాప్ 62.4 బిలియన్ డాలర్లు హెచ్‌బీవో, సీఎన్ఎన్, సినీమ్యాక్స్, కార్టూన్ నెట్వర్క్ తదితర చానల్స్ ఉన్నాయి. ఇంటర్నెట్కి సంబంధించి సీఎన్ఎన్డాట్కామ్, కార్టూన్ నెట్వర్క్డాట్కామ్ మొదలైనవి సినిమాలు, టీవీ కార్యక్రమాల నిర్మాణానికి సంబంధించి వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్ టీవీ, న్యూలైన్ సినిమా మొదలైనవి టైమ్ వార్నర్ గ్రూప్‌లో కీలకంగా ఉన్నాయి. ట్వెంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్: 2013 గణాంకాల ప్రకారం మార్కెట్ క్యాప్ విలువ 75.5 బిలియన్ డాలర్లు. ఫాక్స్ న్యూస్, స్టార్ ఇండియా, నేట్జియో, బిగ్టెన్ నెట్వర్క్ తదితర చానెల్స్ ఉన్నాయి. ప్రీమియం వీడియో కంటెంట్ అందించే హులు వెబ్సైట్లో 33 శాతం వాటాలను కలిగిఉంది. సినిమాలు, టీవీ కార్యక్రమాల నిర్మాణంలో ట్వెంటీయత్ సెంచరీ ఫాక్స్, ఫాక్స్ సెర్చ్‌లైట్ వంటివి ఉన్నాయి.