విడి సిగరెట్లు అమ్మితే జైలుకే
లక్నో: విడి సిగరెట్లు అమ్మితే జైలు పాలుకాక తప్పదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది. విడిగా ఉండే సిగరెట్లు అమ్మే విధానంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అలా చేయడాన్ని తీవ్రమైన నేరం చేసినట్లుగా పరిగణిస్తామని కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు జారీ చేసిన మధ్యంతర ఆర్డినెన్స్పై గవర్నర్ రామ్ నాయక్ ఆమోదముద్ర కూడా వేశారు. ఈ చట్టం ప్రకారం ఏ వ్యక్తయినా విడిగా సిగరెట్లు అమ్మినట్లు సంబంధిత అధికారులు గుర్తిస్తే వారికి వెయ్యి రూపాయల జరిమానాతోపాటు ఒక ఏడాది జైలు శిక్ష అమలు చేస్తారు.
ఒకసారి ఈ శిక్షకు గురైన వ్యక్తి మరోసారి అదే నేరానికి పాల్పడి చట్టాన్ని ఉల్లంఘిస్తే రూ.3 వేల జరిమానాతోపాటు మూడేళ్ల జైలు శిక్ష ఉంటుంది. ఒక వేళ ఇలా విడిగా సిగరెట్లు తయారు చేసేవాళ్లను గుర్తిస్తే మాత్రం వారికి పది వేల జరిమానాతోపాటు ఐదేళ్ల జైలు శిక్ష ఉంటుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.