
శాంసంగ్ ఫోన్లకు ఒబామా ప్రచారం?
శాంసంగ్ కంపెనీకి ఓ సరికొత్త ప్రచారకర్త దొరికారు. ఆయనెవరో కాదు.. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా!!
ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్ల జాబితాలో శాంసంగ్ ఒకటి. ప్రకటనల మీద ఆ కంపెనీ భారీ ఎత్తునే ఖర్చుపెడుతుంది. పెద్దపెద్ద ప్రచారకర్తలు శాంసంగ్ ఫోన్ల గురించి చాలా చెబుతుంటారు. కానీ ఇప్పుడు ఆ కంపెనీకి ఓ సరికొత్త ప్రచారకర్త దొరికారు. ఆయనెవరో కాదు.. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా!! శాంసంగ్ ఫోన్లకు ఒబామా ప్రచారం చేయడం ఏంటని చూస్తున్నారా? అసలు కథ ఏంటో చదవండి.
బోస్టన్ రెడ్ సాక్స్ బాస్కెట్బాల్ క్రీడాకారుడు డేవిడ్ ఓర్టిజ్ తన దగ్గరున్న శాంసంగ్ సెల్ఫోన్తో ఒబామాతో కలిసి కొన్ని ఫొటోలు తీసుకున్నాడు. స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు దాన్ని చూసేందుకు ఒబామా రాగా, ఆయనకు ఒబామా పేరుతో 44వ నెంబరుతో ఉన్న జెర్సీ అందించి మరీ దాంతో ఫొటో తీసుకున్నాడు. తాను అమెరికా అధ్యక్షుడితో ఫొటో దిగానంటూ సహజంగా ఉండే సరదా కొద్దీ దాన్ని కాస్తా ట్విట్టర్లో షేర్ చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు.. చాలా ఫొటోలు ట్విట్టర్లో పెట్టేశాడు. లక్షల సంఖ్యలో ఉన్న ఓర్టిజ్ అభిమానులు ఆ ఫొటోలను రీట్వీట్ చేశారు. అలా అలా అవి కాస్తా ప్రపంచం నలుమూలలకూ పాకాయి.
అక్కడితో ఆగిపోలేదు. శాంసంగ్ కంపెనీ కూడా ఆ ఫొటోను రీట్వీట్ చేసి.. దాన్ని ఒక ప్రకటన రూపంలో ఇచ్చింది. ఆ ఫొటోలన్నింటినీ శాంసంగ్ ఫోన్తో తీశారని ఆ ప్రకటనలో తెలిపింది. ఆ రకంగా శాంసంగ్ కంపెనీకి ఒబామా ప్రచారకర్తగా మారిపోయారు. అయితే, ఈ మార్కెటింగ్ వ్యూహాల గురించి ఒబామాకు తెలియదని, ఓర్టిజ్ ఏదో సరదాగా ఫొటో తీసుకుంటానంటే ఆయన సరేనన్నారంతే తప్ప శాంసంగ్ ప్రచారానికి, ఆయనకు సంబంధం లేదని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ తెలిపారు. ప్రకటనల మీద భారీ ఎత్తున ఖర్చుచేసే శాంసంగ్ కంపెనీ.. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 24 వేల కోట్ల రూపాయలను ఖర్చుపెట్టింది. ఇది యాపిల్ కంపెనీ చేసిన ఖర్చుకు నాలుగింతలు ఎక్కువ. శాంసంగ్ కంపెనీ టీవీలు, ఫ్రిజ్లు, ఇతర ఉత్పత్తులు కూడా తయారుచేస్తున్నా, మార్కెటింగ్ మాత్రం ఎక్కువగా ఫోన్లకే చేస్తుంటుంది.