సియోల్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కో లిమిటెడ్ ఆర్థిక ఫలితాల్లోఅదరగొట్టింది. నాలుగో త్రైమాసికంలో నిర్వహణ లాభంలో భారీ వృద్ధిని నమోదుచేసింది. చిప్స్ వ్యాపారంలో రికార్డు ఆదాయాలతో ఆపరేటింగ్ లాభాల్లో 50 శాతం జంప్ చేసింది
గతమూడు సంవత్సరాల్లో అత్యధిక పెరుగుదలను సాధించినట్టు శాంసంగ్ ప్రకటించింది.
గెలాక్సీ నోట్ 7 పేలుళ్లతో ఇబ్బందులనెదుర్కొన్న దక్షిణ కొరియా దిగ్గజం రికార్డ్ లాభాలను ప్రకటించింది. అక్టోబర్- డిసెంబర్ కాలానికి 9.22 ట్రిలియ్లను (7.9 బిలియన్ డాలర్ల) ఆపరేటింగ్ లాభాలను ఆర్జించింది. అలాగే స్థిరమైన ఆదాయాన్ని ఆర్జించి... 0.6 శాతం పెరిగి 201.9 ట్రిలియన్లను నమోదు చేసింది. నోట్ 7 రీకాల్ సంక్షోభంలో కూడా సాలిడ్ ఫలితాలను సాధించినట్టు కంపెనీ చెప్పింది. బాగా వృద్ధి చెందిన డాలర్ ఆదాయం కూడా ఈ లాభాలకు తోడ్పడినట్టు తెలిపిందిదీంతో అతిపెద్ద రీకాల్ సంక్షోభం నుంచి కోలుకున్న సంస్థ 9.3 ట్రిలియన్ల షేర్లను తిరిగి కొనుగోలు చేసేందుకు యోచిస్తున్నట్టు శాంసంగ్ ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా గెలాక్సీ నోట్ 7 కష్టాలకు తోడు గత వారం దేశంలోని అతిపెద్ద స్కాంలో శాంసంగ్ అధిపతి లీ జే-యాంగ్ ఇరుక్కున్నారు. దేశ అధ్యక్షురాలు పార్లమెంటులో అభిశంసనకు గురైన ఈ అవినీతి కుంభకోణంలో ఆయన ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే లీ తృటిలోఅరెస్ట్ ప్రమాదంనుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే.